కొడుకు మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు
కాకినాడ: లే కన్నా.. ఇంటికెళ్దాం అంటూ కొడుకు మృతదేహం వద్ద ఓ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు అచేతనంగా పడి ఉండడం చూసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. చెరువులో పడి ఓ బాలుడి మృతి చెందిన ఘటన నీలాద్రిపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటకు చెందిన కాసా వరలక్ష్మీ, సత్తిబాబు దంపతులు.
సత్తిబాబు తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి తొమ్మిదేళ్ల కుమారుడు కాసా యశ్వంత్ సింగర సూర్య మూడో తరగతి వరకు చదువుకున్నాడు. అక్కడి నుంచి చదువు మానేశాడు. సొంత గేదెలను మేపుతూ ఉండేవాడు. సోమవారం ఇంటికి సమీపంలోని సూరయ్య చెరువులో వాటికి తాగునీటి కోసం తోలుకు వెళ్లేవాడు. గేదెలను చెరువులోకి తోలుకు వెళ్లి వాటి వెంట తాను కూడా చెరువులోకి దిగాడు. ఈ నేపథ్యంలో నీటిలో మునిగిపోతుండగా, వెంట వెళ్లిన తమ్ముడు దిలీప్ వాళ్ల అమ్మమ్మ మంగకు చెప్పాడు.
ఆమె కేకలు గమనించిన స్థానిక యువకులు హుటాహుటిన చెరువులోకి దిగి బాలుడి కోసం గాలించారు. సుమారు రెండు గంటల అనంతరం సింగర సూర్యను వెలికితీసి, జెడ్.రాగంపేట పరిధిలోని సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు వరలక్ష్మి, సత్తిబాబు రాజవొమ్మంగి పరిధి లబ్బర్తిలో బాలుడి నాన్నమ్మ మృతి చెందడంతో అక్కడకు వెళ్లారు. జరిగిన సంఘటన తెలిసిన వెంటనే తల్లి సీహెచ్‌సీకి వచ్చి.. లే నాన్నా అంటూ విలపించింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 3 టిఫిన్ల బిల్లు రూ.795


