
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.
నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.