విశాఖ జూకు కొత్త అతిథులు | Sakshi
Sakshi News home page

విశాఖ జూకు కొత్త అతిథులు

Published Sat, May 18 2024 5:25 AM

New guests to Visakha Zoo

సీజెడ్‌ఏ అనుమతులు 

త్వరలోనే సందడి చేయనున్న వన్యప్రాణులు

ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్‌ జూ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సీజెడ్‌ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.

కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్‌కతాలోని అలీపూర్‌ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్‌ వాటర్‌ మానిటర్‌ లిజర్డ్స్, జత స్కార్లెట్‌ మకావ్‌ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్‌నెక్డ్‌ వాలిబీ, స్వైరల్‌ మంకీస్, మార్మోసెట్‌ మంకీస్, గ్రీన్‌ వింగ్‌ మెకావ్‌లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు సిద్ధం చేశారు.  

జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్‌ టార్టోయిస్‌లు  
జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్‌ టార్టోయిస్‌లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవి­తకాలం వంద సంవత్సరా­లు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్‌ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. 

ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్‌ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్‌ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.

త్వరలోనే కొత్త వన్యప్రాణులు  
విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్‌కాట్, రెడ్‌నెక్డ్‌ వాలబీ, స్వైరల్‌ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్‌ వింగ్డ్‌ మకావ్‌ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్‌ టోర్టోయిస్‌లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్‌ఏ అనుమతులు లభించాయి. 

అహ్మదాబాద్‌ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్‌ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్‌ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్‌ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.   – డాక్టర్‌ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం 

Advertisement
 
Advertisement
 
Advertisement