ప్రభుత్వ పెద్దల ఆదేశం.. పోలీసు పెద్దల పన్నాగం
హెబియస్ కార్పస్ పిటిషన్ నుంచి తప్పించుకునే తంత్రం
బాస్, బిగ్‌బాస్, ప్రభుత్వ పెద్దలను కాపాడే కుతంత్రం
న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్న వైనం
సాక్షి, అమరావతి: అబ్రకదబ్ర అంటూ గాల్లో వస్తువులు సృష్టించడం ఇంద్రజాల విద్య. కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. అబ్రకదబ్ర అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద సృష్టించింది. సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌లో అంతమైన కేసును నీరుగార్చేందుకు సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ కేసు నుంచి పోలీసు, ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు ఏకంగా న్యాయస్థానం కళ్లుగప్పేందుకు బరితెగించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయంలో పక్కా స్కెచ్ సిద్ధమైపోయిందని హైకోర్టులో పోలీసులు సమర్పించిన లంచ్ మోషన్ పిటిషన్ బట్టబయలు చేస్తోంది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌పై తమకు కొన్ని ఎముకలు, కొంత బూడిద దొరికినట్లు హఠాత్తుగా ఓ కట్టుకథను వినిపించడం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టును బురిడీ కొట్టించడం.. ఈ కేసు నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు, విజయవాడ పోలీస్ కమిషనర్‌తోపాటు తెరవెనుక పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రను తప్పించడం.. కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు పన్నిన కుతంత్రం విస్తుగొలుపుతోంది.
రెండు నెలల తర్వాత పోలీస్ స్టేషన్‌పై ఎముకలు, బూడిద!
సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యమైన దారుణాన్ని దారి మళ్లించేందుకు పోలీసులు పన్నిన సరికొత్త పన్నాగం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని నెల క్రితమే ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు నియమించిన సిట్ అధికారిక సమాచారం ప్రకారం సాయికృష్ణను మే 6న కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. అంటే ఇప్పటికి దాదాపు రెండు నెలలు అవుతోంది. రెండు నెలల తర్వాత సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్ డాబా మీద హఠాత్తుగా కొన్ని ఎముకలు, కొంత బూడిదను గుర్తించారట.
అంతే కాకుండా అనుమానాస్పద మరకలతోపాటు ఓ లాఠీని కూడా గుర్తించారని సిట్ హైకోర్టుకు సమరి్పంచిన నివేదికలో పేర్కొంది. సాయికృష్ణను ఎక్కడికో తరలించి మరీ దహనం చేయడం ద్వారానో మరో విధంగానో లేకుండా చేశారని ఇదే సిట్ మొదట పేర్కొంది. విద్యుత్ దహన వాటికలో అనాథ మృతదేహంగా బూడిద చేశారనే బలమైన వాదనా ఉంది. సిట్ అధికారులు విద్యుత్ దహన వాటికకు వెళ్లి దర్యాప్తు చేశారు కూడా. కాగా అందుకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికాయని సిట్ చెప్పడం విడ్డూరం.
హెబియస్ కార్పస్ పిటిషన్ నుంచి తప్పించుకునేందుకే..
సాయికృష్ణ ఆచూకీ కోసం ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై పోలీసు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాయికృష్ణను గానీ, ఆయన మృతదేహాన్ని గానీ, ఆయనకు సంబంధించిన డీఎన్‌ఏ అవశేషాలనుగానీ గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకే తాము ఏదో ఎముకలు, బూడిద కనుగొన్నాం.. దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టును తప్పుదారి పట్టించాలన్నది పోలీసుల ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్‌ఏ నమూనాలతో కనీసం పరీక్ష కూడా చేయించలేదు. కొన్ని వాయిదాల తర్వాత డీఎన్‌ఏ నమూనాలు సరిపోలేదని చెప్పవచ్చులే అన్నది పోలీసుల ధీమాగా స్పష్టమవుతోంది.
సిట్.. ఈ ప్రశ్నలకు బదులివ్వాలి
» ఎక్కడో బయటకు తీసుకువెళ్లి దహనం చేసి ఉంటే.. అక్కడి నుంచి ఎముకలు, బూడిద తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ మీద దాచారా?
» ఒకవేళ పోలీస్ స్టేషన్ డాబా మీదే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి ఉంటే, అప్పుడు వచ్చే మంటలు, పొగను ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది నివాసాల్లో ఉన్న వారు గమనించలేదా?
» అదే జరిగి ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ ఈ విషయం తెలిసి ఉండదా?
» మరి విజయవాడ కోర్టుకు సమర్పించిన సాయికృష్ణ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలను ఎందుకు వెల్లడించ లేదు?
»ప్రస్తుతం హఠాత్తుగా హైకోర్టుకు ఎందుకు ఈ విషయాన్ని చెప్పినట్టు?
» హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ఇది బరితెగించడం కాదా?
టాస్క్ ఫోర్స్, సీపీ, డీజీపీ, పెద్దలను తప్పించడమే లక్ష్యం
టీడీపీ ప్రజా ప్రతినిధి భూ, ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలోనే సాయికృష్ణను అంతం చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారం వెనుక కేవలం సీఐ నాగరాజు పాత్రధారి మాత్రమేనని.. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు పాత్ర ఉందన్నది నిర్వివాదాంశం. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా ఉన్నారని పోలీసువర్గాలే చెబుతున్నాయి. ఈ కేసును కేవలం సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అందుకే కృష్ణలంక పోలీస్‌స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికినట్టు కట్టు కథను తెరపైకి తెచ్చారు.
కాగా, సాయికృష్ణ లాకప్‌లోనే అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సీఐబీకి అప్పగించాలని సామాజికవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే టాస్క్ ఫోర్స్ అధికారులు, సీపీ, డీజీపీలతోపాటు ప్రభుత్వ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది. అందుకే ఈ కేసు దర్యాప్తులో ఏదో పురోగతి సాధించామని నమ్మించేందుకు.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించేందుకు వీలుగా పోలీసు పెద్దలే పోలీస్ స్టేషన్‌పై కొన్ని ఎముకలు, కొంత బూడిద లభించాయనే కట్టుకథను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. సాయికృష్ణ లాకప్ హత్య కేసును పూర్తిగా నీరుగార్చేందుకు పోలీసు పెద్దలు ఇంతగా బరితెగిస్తుండటం సదరు శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


