Andhra Pradesh: ఇక నుంచి నూతన విద్యా విధానం

New education policy from now on - Sakshi

పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

నూతన విధానానికి అనుగుణంగా పాఠశాలల ఏర్పాటుకు ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్నిస్థాయిల కార్యనిర్వాహక అధికారులు ప్రస్తుతమున్న విధానం నుంచి నూతన విద్యావిధానంలోకి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఎలా మ్యాపింగ్‌ చేయాలనే దానిపై కసరత్తు చేసి జూన్‌ 2వ తేదీలోగా నివేదికలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. నూతన విధానంపై మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు.

నూతన విధానంలో ఇలా..
► ఈ విధానంలో మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇకనుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు.
► ఆ తరువాత ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్‌ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి.
► సాధ్యమైనంత వరకు అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలి. అలా ఒకే ప్రాంగణం లేదా ఒకే భవనంలో ఇవి ఉండేలా చేసి.. వాటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పరిగణించాలి.
► ప్రతి ఫౌండేషన్‌ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్‌ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ–1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు.
► ప్రస్తుత ప్రాథమిక స్కూళ్లలో ఉండే 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని యూపీ స్కూల్‌ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలి.
► ఈ విద్యార్థులను తరలించేప్పుడు ఆ యూపీ, హైస్కూళ్లలో తరగతి గదులు లేకుంటే అదనపు తరగతి గదులు ఎన్ని నిర్మించాల్సి ఉంటుందో కసరత్తు చేసి వాటిని నాడు–నేడు కింద నిర్మింపచేస్తారు.
► ఇలా 3–5 విద్యార్థులు అదనంగా చేరినప్పుడు యూపీ స్కూలులో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు.
► 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.
► విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇటువంటివి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటవుతాయి.
► ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తారు.
► పిల్లల ఇంటికి సమీపంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉండాలి. ఫౌండేషన్‌ స్కూలు ఒక కిలోమీటర్‌ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.
► టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడాలి.
► ఈ విధానంలో ఎక్కడా ఒక్క అంగన్‌వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదు.
► విద్యార్థులను 3 కిలోమీటర్ల పైబడి తరలింపు చేయకూడదు.
► ఈ మార్గదర్శకాలను అనుసరించి డీఈవోలు, ఇతర అధికారులు నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్ల ఏర్పాటుకు మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టాలి. అలాగే ఎంతమంది పిల్లలు యూపీ, హైస్కూళ్లకు తరలింపు చేయాల్సి ఉంటుంది, అక్కడ అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమో నిర్ణయించాలి. వీటిని 2022–23, 2023–24 సంవత్సరాల్లో నిర్మించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలి.
► సెకండరీ స్కూళ్లకు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలి.
► ఈ కసరత్తు పూర్తిచేసి జూన్‌ 2వ తేదీకల్లా వివరాలను గూగుల్‌ లింక్, ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top