భానుడి భగభగ.. అనూహ్యంగా పెరిగిన ధర.. కేజీ 160.. చరిత్రలో తొలిసారి!

Nellore: Price Hikes Profit For Neem Farmers - Sakshi

ఈ ఏడాది నిమ్మ రైతుల పంట పండింది. అనూహ్యంగా ధరలు పెరుగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్‌లో కేజీ రూ.140 నుంచి రూ.160 వరకు పలికింది. ధరలు బాగుండడంతో అప్పుల ఊబి నుంచి బయట పడుతున్నామంటూ అన్నదాతలు సంతోషంగా చెబుతున్నారు.

సాక్షి,గూడూరు/సైదాపురం: నిమ్మ ధరలు పసిడి ధరలను తలపిస్తున్నాయి. చరిత్రలో ఇప్పటివరకూ రాని ధరలు ఆదివారం పలికాయి. లూజు బస్తా కనిష్టంగా రూ.11 వేల నుంచి గరిష్టంగా రూ.13 వేల వరకూ చేరింది. కిలో రూ.140 నుంచి రూ.160 వరకూ ధర పలికింది. అదేవిధంగా పండ్లకు రూ.110 నుంచి రూ.130 వరకూ రావడంతో రైతుల ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో వారంరోజుల నుంచి నిమ్మ మార్కెట్‌లో ఆశించిన మేర ధరలు వస్తుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆపిల్‌ ధర కన్నా నిమ్మ ధరలే అధికంగా ఉన్నాయంటూ సంతోషంగా చెబుతున్నారు.

కాపు లేకపోవడంతోనే..
ఒక్క రోజులో ఢిల్లీ మార్కెట్‌కు కాయలు తీసుకొచ్చే దూరంలో ఉన్న భావానగర్‌లో, మహారాష్ట్రలోని బీజాపూర్‌లో, మన రాష్ట్రంలోని రాష్ట్రంలోని తెనాలి, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కాపు లేకపోవడంతోనే ఈ ధరలు నమోదువుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అలాగే మన ప్రాంతంలో తీవ్ర వర్షాల కారణంగా ఆలస్యంగా పూత ఆలస్యమైంది. ఇలా అనేక అంశాలు కలిసి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మూడేళ్లగా ఈ సీజన్‌లో నిమ్మకాయలకు విపరీతమైన ధరలు వస్తుండడంతో రైతులు నష్టాల ఊబి నుంచి బయటపడున్నారు.

మంచి డిమాండ్‌
గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్లకు ఢిల్లీ మార్కెట్‌ గుండెలాంటిదని చెబుతుంటారు. అక్కడ ధరలు బాగా పలుకుతుంటేనే ఇక్కడి నిమ్మ మార్కెట్‌ కళకళలాడుతుంది. అటు నార్త్‌ ఢిల్లీ, సౌత్‌ చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి రెండు రోజులుగా కాయలు కావాలంటూ స్థానిక మార్కెట్లలోని వ్యాపారులను అడుగుతున్నారు. 

ఎప్పుడూ చూడలేదు
నిమ్మకాయల ధరలు ఇప్పటి వరకూ ఈ స్థాయిలో పలికింది లేదు. నాకు తెలిసే కాకుండా, మా పెద్దల కాలంలో కూడా ఇలా ధరలు రాలేదు. 2009లో లూజు బస్తా గరిష్టంగా రూ.9 వేలు పలికితే అబ్బో అన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు కొన్నాళ్లు నిలబడితే చాలు. 
– జగన్నాథం, రైతు, వెంకటేశుపల్లి

ఆనందంగా ఉన్నాం
నిమ్మ ధరలు ఇప్పటి వరకూ ఇంత పలికిందే లేదు. జగనన్న పాలనలో రైతులే రాజులుగా మారారు. అందుకు నిదర్శనమే నిమ్మకాయల ధరలు ఈ స్థాయికి చేరడం. కాయలుంటే ధరల్లేక, ధరలుంటే కాయల్లేక ఇబ్బందులు పడే నిమ్మరైతుల కష్టాలు తేరినట్లే.. చాలా ఆనందంగా ఉన్నాం. 
– వజ్జా అనిల్‌రెడ్డి, రైతు, వెందోడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top