ఏపీ: ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

Neelam Sahani Took Charge As The Ap Election Commissioner - Sakshi

8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌

ఏడాది క్రితం మధ్యలో ఆగిన ఎన్నికల కొనసాగింపు

నోటిఫికేషన్‌ విడుదల 2,371 ఎంపీటీసీ స్థానాలు 

ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,321 చోట్ల ఎన్నిక 

జెడ్పీటీసీ స్థానాలలోనూ 126 ఏకగ్రీవం కాగా, మిగిలిన 526 చోట్ల ఎన్నికలు 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ

సీఎస్‌ వినతి మేరకు వెంటనే ఎన్నికల ప్రక్రియపై దృష్టి 

నేడు రాజకీయ పార్టీలతో భేటీ 

సాక్షి, అమరావతి: ఏడాది క్రితం అర్థాంతరంగా ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నీలంసాహ్ని తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు గురువారం ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  అప్పట్లో ఆగిన  చోట నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఈ నెల 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య  పోలింగ్‌ నిర్వహిస్తారు. అవసరమైన చోట 9వ తేదీన రీ పోలింగ్‌ జరిపి, పదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కనీసం ఐదు రోజులు పూర్తిగా  ప్రచారానికి అవకాశం ఉండేలా.. ఎన్నికల కొనసాగింపు ప్రకటనకు, పోలింగ్‌ తేదీకి మధ్య ఆరు రోజుల సమయం కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్టు నీలం సాహ్ని ప్రకటించారు. 

526 జెడ్పీటీసీ స్థానాలకు, 7,321 ఎంపీటీసీ స్థానాలకు.. 
ఏడాది క్రితం నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మినహాయించి 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,321 ఎంపీటీసీ స్థానాల్లో 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కోర్టు కేసు కారణంగా కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, 9,692 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటిలో 2,371 ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,321 చోట్ల ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 652 చోట్ల ఎన్నికలు జరిపేందుకు అప్పట్లో నోటిఫికేషన్‌ జారీ అయింది. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 526 చోట్ల  ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ స్థానాలలో మొత్తం 2092 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 

చకచకా పరిణామాలు.. 
గురువారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ను మర్యాదపూర్వకంగాకలిశారు. కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వచ్చి కొత్త ఎస్‌ఈసీతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికలకు సంబంధించి మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కరొనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించే వీలుంటుందన్న అంశాన్ని ఆయన నీలం సాహ్నితో  వివరించినట్టు తెలిసింది.

పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో సమావేశం.. 
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎస్‌ నుంచి అందిన వినతి మేరకు కొత్త ఎస్‌ఈసీ నీలంసాహ్ని ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌  అయ్యన్నార్తో గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్, పోలీసు అదనపు డీజీ లిద్దరూ ఎన్నికల నిర్వహణకు సన్నదద్దతను తెలియజేయడంతో క్షేత్రస్థాయిలో  ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. 

ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు.. 
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపునకు పూర్తి సన్నద్దంగా ఉండాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో  నీలం సాహ్ని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ పేపరు ముద్రణ, బ్యాలెట్‌ బాక్సు్ల, సరిపడినన్ని ఓటర్ల జాబితాలు సిద్దం చేసుకోవాలని  కలెక్టర్లను ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్‌ సింఘాల్‌ కూడా వీడియో కాన్ఫరెన్సో్ల పాల్గొని కరోనా జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు.  కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై సూచనలు తీసుకునేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 19 రాజకీయ పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

పార్టీ అభ్యర్ధులు చనిపోయిన చోట ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్‌.. 
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉండి, అభ్యర్ధులు చనిపోయిన చోట నిబంధనల ప్రకారం ఆయా పార్టీలు  మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు వీలుగా ఆ స్థానాల్లో ఎన్నికలు తాత్కాలికంగా మరికొంత కాలం వాయిదా వేయాలని నిర్ణయించారు. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో ఉన్న వారు మరణించిన చోట మాత్రం ఎన్నికలను యధావిధిగా కొనసాగిస్తారు. అయితే, చనిపోయిన అభ్యర్ధి పేరు బ్యాలెట్‌ నుంచి ™తొలగిస్తారు. ఏకగ్రీవమైన వారితో కలిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 88 మంది, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 13 మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం గుర్తించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన 88 మందిలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు చనిపోయారని, అక్కడ మాత్రమే ఎన్నికలు యధావిధిగాకొనసాగుతాయని అదికారులు తెలిపారు. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన13 మందిలో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఉన్నారని, అక్కడ మాత్రం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఏకగ్రీవాలపైనా కలెక్టర్లకు స్సష్టత  
ఏడాది క్రితం నామినేషన్‌ ఉపసంహరణ రోజే 2371 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు  ఏకగ్రీవం కాగా, 126 జడ్సీ స్థానాలు ఏకగ్రీవంగానే ముగిశాయి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో పాటు ఎన్నికల నిబంధనలు ప్రకారం అలాంటి వారికి స్థానిక ఎన్నికల  రిటర్నింగ్‌ అధికారులు గెలుపొందినటుŠుట ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఏడాది క్రిత్రమే ధృవీకరణ పత్రాలు అందుకున్నప్పటికీ కొత్తగా ఎన్నికైన సభ్యులతో సమానంగా పదవీ కాలం ఉంటుంది.  ఈ మేరకు నీలంసాహ్ని గురువారం కలెక్టర్లు, అధికారులకు  స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది.

స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు  
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తాను  పక్షపాతం లేకుండా పనిచేస్తానని, ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తాననినీలం సాహ్ని పేర్కొన్నారు.

చదవండి: ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top