విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించలేరు..

Muttamsetti Srinivasa Rao comments about Visakha Steel Plant - Sakshi

మహాపాదయాత్రలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌

కేంద్ర మొండి వైఖరి సబబు కాదని హితవు

గాజువాక: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు ఏడు నెలలుగా పోరాడుతున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం సబబు కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ స్టీల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉక్కు అఖిల పక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో ఆదివారం నిర్వహించిన మహా పాదయాత్రను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించలేరని స్పష్టం చేశారు. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాయన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు నష్టాలొచ్చాయన్నది మాత్రం దుష్ప్రచారమని కొట్టిపారేశారు. జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య  తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top