ఎంత పనిచేశావ్‌.. వెంకట్రావ్‌..! నమ్మించి..

Municipal Health Assistant Escaped With Loan Of Rs 25 Lakhs - Sakshi

రూ.25లక్షలు అప్పుచేసి పరారైన మున్సిపల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌

4 నెలలుగా విధులకు డుమ్మా

లబోదిబోమంటున్న అప్పులిచ్చినవాళ్లు

ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్న మున్సిపల్‌ అధికారులు

సాక్షి, కందుకూరు: నమ్మినవాళ్లను నిలువునా ముంచాడు ఓ మున్సిపల్‌ ఉద్యోగి. అందినకాడికి అప్పు తీసుకొని అడ్రస్‌ లేకుండా పోయాడు. ఈ ప్రబుద్ధుడికి అప్పులిచ్చిన వాళ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్‌ వ్యక్తులు ఉన్నారు. గత నాలుగు నెలలుగా అతని ఆచూకీ లేకపోవడంతో అప్పు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. విధులకు ఎగనామం పెట్టిన ఉద్యోగిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీరాలకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కందుకూరు మున్సిపల్‌ కార్యాలయంలో గత ఆరేళ్లుగా హెల్త్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకున్నాడు. సొంత అవసరాలు ఉన్నాయంటూ తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. కందుకూరు పట్టణంలో పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తుల వద్ద సుమారు రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని అడిగిన వారికి సాకులు చెబుతూ వచ్చాడు.

ఈ క్రమంలోనే 4 నెలల నుంచి వెంకట్రావ్‌ అడ్రస్‌ లేకుండా పోయాడు. వెంకట్రావు కుటుంబం తూర్పుకమ్మపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందుకూరు వచ్చి ఇంట్లో సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పులిచ్చినవాళ్లు అడ్డుకున్నారు. వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని అప్పులవాళ్లకి సర్దిచెప్పి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వెంకట్రావ్‌ ఆచూకీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతనిపై చీటింగ్‌ కేసు పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వెంకట్రావ్‌పై ఇదే విధమైన కేసులు ఒంగోలులోనూ ఉన్నాయని, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు. 

చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం)

నాలుగు నెలలుగా విధులకు డుమ్మా
మున్సిపాలిటీ హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్రావ్‌ గత నాలుగు నెలల నుంచి విధులకు హాజరుకావడం లేదని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. జూన్‌ 23వ తేదీన రెండు రోజులు సీఎల్‌ పెట్టి వెళ్లారని, అప్పటి నుంచి విధులకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి అడ్రస్‌కు పలుమార్లు నోటీసులు పంపామని, కానీ ఇల్లు లాక్‌ చేసి ఉండటంతో తిరిగి మున్సిపాలిటీకి వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంపై మున్సిపల్‌ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు మేనేజర్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top