అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం.. నా పరిస్థితి అర్థం చేసుకోండి

Rangayya Shetti Grandson Praveen Whatsapp Mesage To Victims - Sakshi

దేవుడు కరుణిస్తే అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా 

బాధితులకు రంగయ్యశెట్టి మనవడు ప్రవీణ్‌ వాట్సాప్‌ మెసేజ్‌ 

సాక్షి, పెనుమూరు(చిత్తూరు): ‘గత్యంతరం లేక ఐపీ పెట్టాం. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోర్టులో నడుస్తున్న భూమి కేసు పరిష్కారం అయితే కానీ మా కష్టాలు తీరవు’ ఇది వ్యాపారి కోడూరు రంగయ్య శెట్టి మనువడు ప్రవీణ్‌కుమార్‌ ఐపీ బాధితులకు పెట్టిన వాట్సప్‌ మెసేజ్‌. పెనుమూరులో 60 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేసిన రంగయ్య శెట్టి గత వారం దాదాపు 997 మందికి రూ.87.40 కోట్లు ఐపీ పెట్టి అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై రుణదాతలు పెనుమూరులో ఈ నెల 6న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డీఎస్పీ సుధాకరరెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు.

చదవండి: (‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’)

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటలకు రంగయ్యశెట్టి మనుమడు ప్రవీణ్‌ రుణదాతలకు వాట్సప్‌ మెసేజ్‌ పెట్టారు. అందులో తన తండ్రి చేపట్టిన ట్రావెల్స్, వడ్డీ, గ్రానైట్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల క్రితం వరకూ నెలకు రూ. కోటి వడ్డీ కడుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్లాట్లు, 70 ఎకరాల భూమి అమ్ముకున్నట్లు మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఇక గత్యంతరం లేక ఐపీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నానని, తన పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు.

ప్రస్తుతం తిరుపతిలోని భూమిపై కోర్టులో కేసు నడుస్తోందని, ఆ కేసు పరిష్కారం అయితే తమ కష్టాలు తీరుతాయన్నారు. ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్‌ వాట్సాప్‌ చేసిన ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.  


Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top