ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి

MP Bharat Appealed To Railway Board Chairman On Permission To Halt Trains - Sakshi

సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్‌లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్‌, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం‌ అందజేశారు.‌ రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. 

హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్‌ పూర్‌ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. ‌విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు.

విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు.

బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు.

నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన‌ ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు.
చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top