బయపరెడ్డీ అని కేక వేస్తే.. ఒకరు కాదు.. పది మంది వస్తారు.. ఎందుకంటే?

Most People With The Same Name In Nallamekala Palli Village - Sakshi

నల్లమేకలపల్లిలో చాలా మందికి ఒకే పేరు

ఇంటి దేవుడిపై భక్తితో నామకరణం 

ఒకర్ని పిలిస్తే పది మంది వస్తున్న వైనం

మహిళల పేర్లు సైతం బయమ్మలే!

ప్యాపిలి(కర్నూలు జిల్లా): ఆ గ్రామంలోకి వెళ్లి బయపరెడ్డీ అని కేక వేస్తే పది మంది వస్తారు. ఎందుకంటే ఆ ఊరిలో ఆ పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి సైతం అదే పేర్లు ఉన్నాయి. ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామ విశేషం ఇది. గ్రామంలో వివిధ కులాలకు చెందిన 1,500 మంది నివాసం ఉంటున్నారు. వీరిలో రెడ్డి కులస్తులు 380 మంది ఉన్నారు. బోరుబావుల కింద అరటి, జామ, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నారు.

చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్‌ 

వైఎస్సార్‌ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామంలో వెలసిన భైరవేశ్వర స్వామిని వీరు ఇంటి దేవుడిగా కొలుస్తారు. స్వామిపై భక్తితో బయపరెడ్డి అనే పేరు పెట్టుకోవడం పూర్వం నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని రెడ్డి కులస్తుల ఇంట్లో ఈ పేరు పెట్టుకోవడం విశేషం. ఇబ్బందులు ఎదురుకాకుండా పేరుకు ముందు పెద్ద, నడిపి, చిన్న, రాం, స్వామి, శివ, వెంకట, చాణక్య, సాయి అని పిలుస్తున్నారు. మహిళలు సైతం బయమ్మ పేరు పెట్టుకుంటున్నారు.

చదవండి: తెనాలి కుర్రోడు.. తగ్గేదే లే.. చదివింది 8.. నెలకు రూ.3లక్షలకుపైనే..

ఒకరు తప్పు చేస్తే మరొకరికి దండన
మా ఇంటి దేవుడు భైరవేశ్వరుడు. మా పెద్దల కాలం నుంచే బయపరెడ్డి అనే పేరు పెడుతున్నారు. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా భైరవేశ్వర స్వామిని దర్శించుకుంటాం. బయపరెడ్డి పేర్లు ఎక్కువగా ఉండడంతో స్కూల్‌లో ఒకరు తప్పు చేస్తే మరొకరు చీవాట్లు, దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి.
 – పేరం బయపరెడ్డి  

పొరబాటు పడేవారు 
ఇప్పుడైతే సెల్‌ఫోన్లు ఉన్నాయి కాబట్టి నంబర్‌ ద్వారా ఎవరి అడ్రస్‌కు వారి బంధువులు వెళ్లి పోతున్నారు. ఫోన్‌లు లేని సమయంలో పొరబడి ఒకరి ఇంటికి వెళ్లబోయి మరొకరి ఇంటికి వెళ్లి మాటలు కలిపేవారు. అసలు విషయం తెలుసుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఈ సంఘటనలు  నవ్వు తెప్పించేవి.
– పెద్ద బయపరెడ్డి  

పేరు మంచిదని నమ్ముతాం 
మా కుటుంబాల్లో చాలా మంది బయపరెడ్డి పేరు పెట్టుకుంటారు. సులభంగా గుర్తు పట్టుకునేందుకు వీలుగా పేరుకు ముందు సాయి, శివ అని పెట్టుకుంటున్నారు. ఇంటి దేవుడి పేరు మంచిదని మా నమ్మకం.
– బయపరెడ్డి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top