
రైతు సాధికారత సదస్సులో మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల, పక్కన అజేయ కల్లం, మంత్రులు సుచరిత, కన్నబాబు, అప్పలరాజు, సీఎస్ పూనం మాలకొండయ్య తదితరులు
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: రైతే కేంద్రంగా పరిశోధనలు జరగాలని, అన్నదాతల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, సిబ్బంది సమైక్యంగా కృషి చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో జరిగే పరిశోధనలు, కనిపెట్టే అంశాలు రైతు సమగ్రాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అన్నదాతలను ఆత్మబంధువులుగా, అత్యంత ఆప్తులుగా పరిగణించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలలను సాకారం చేసేలా కలసికట్టుగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాలు, ఏపీ వ్యవసాయ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సాధికారతకు సమీకృత విధానాలపై నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సు మంగళవారం గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది.
వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధ్యక్షతన ప్రారంభమైన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతే కేంద్రంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో ఆయన చేపట్టిన రైతుభరోసా కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగా జగన్ రైతులు, ఇతర వర్గాల ప్రజల మనసుల్లో నిలవాలనుకుంటున్నారని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనలు క్షేత్రస్థాయికి చేరాలని సూచించారు.
పశుసంవర్ధకశాఖ మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ ఈ రంగాల్లో గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి చూపించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి, వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శేఖర్‌బాబు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. త్రిమూర్తులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి విధాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జి.రఘునాథరెడ్డి, వ్యవసాయ మిషన్ మెంబర్ కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖరరెడ్డి, శాస్త్రవేత్త కె.గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.