కొల్లేరులో వలస పక్షుల సందడి

Migratory Birds In Kolleru Lake - Sakshi

కొల్లేరులో ఎటుచూసినా విదేశీ పక్షులే

లక్షలాది కిలోమీటర్ల నుంచి అరుదైన పక్షుల రాక

కైకలూరు(ఏలూరు జిల్లా): కిక్కిస పొదలు.. అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయబారులు రాజహంసల్లా సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరి­యా, రష్యా, టర్కీ, యూరప్‌ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదా­వరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నాయి. అందరికీ విదేశీ పక్షులుగానే కనిపించే.. ఈ విహంగాలు కొల్లేరు ప్రాంత వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ఏటా ఇక్కడకు విచ్చేస్తాయి.

6 లక్షల పక్షుల రాక
రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం 77,185 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్‌లో వలసబాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. కొల్లేరు అభయారణ్యంలో 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్‌ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్‌ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. ఏలూరు రేంజ్‌ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాలుగా పక్షుల లెక్కింపు జరుగుతోంది.

డిసెంబర్‌ రెండో వారానికి దాదాపు స్వదేశీ, విదేశీ పక్షులు 5 లక్షల 20 వేలను గుర్తించారు. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు గుర్తిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో స్పాట్‌ బిల్డిన్‌ పెలికాన్, కామన్‌ శాండ్‌పైపర్, బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్‌ స్టార్క్, రివర్‌ టర్న్, జకనా, లార్జ్‌ విజిటింగ్‌ డక్, ఓరియంటల్‌ డాటర్, కామన్‌ రెడ్‌ షంక్‌ వంటి 43 రకాల వలస పక్షులను ప్రస్తుతానికి అటవీ సిబ్బంది గుర్తించారు. 

వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది
ప్రకృతి అనుకూలించడంతో కొల్లేరుకు వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తుండగా.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పక్షుల గణన జరుగుతోంది. పక్షుల ఆవాసాల కోసం అటవీ శాఖ కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేస్తోంది.
– ఎస్‌వీకే కుమార్, ఫారెస్ట్‌ వైల్డ్‌ లైఫ్‌ రేంజర్, ఏలూరు
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top