ఏపీలో డిజిటల్‌ బోధన సూపర్‌

Mexico IB representatives visit various schools in Krishna district - Sakshi

మెక్సికో ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంస 

కృష్ణా జిల్లాలో వివిధ పాఠశాలల సందర్శన  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యావిధానం అద్భుతంగా ఉందని మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్డో మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విజయవాడలోని ఎంకే బేగ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లోని గదులను, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు.

విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బోధనా అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు విన్నారు. అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైసూ్కళ్లను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్‌ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్‌ ప్రదర్శన, సైన్స్‌ ల్యాబ్‌ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్‌ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ముగ్దులయ్యారు.

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్‌ విధానంపై ప్రిన్సిపల్‌ను ఆరా తీశారు. విద్యార్థి నుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు. స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిందని, వసతుల కల్పనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించిందని ఆల్డో అభినందించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్‌సీఈఆర్టీ ప్రొఫెసర్‌ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్‌ అలీ ఉన్నారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top