కాబోయే అమ్మలకు సర్కార్‌ అండ

Measures to control diabetes in pregnant women - Sakshi

గర్భిణుల్లో మధుమేహం నియంత్రణకు పకడ్బందీ చర్యలు 

ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు 

పీహెచ్‌సీ నుంచి అన్ని వైద్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు 

దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ‘జస్టేషనల్‌ డయాబెటిస్‌’

సాక్షి, అమరావతి: గర్భిణుల్లో వస్తున్న మధుమేహం (జస్టేషనల్‌ డయాబెటిస్‌) నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గర్భిణుల్లో వచ్చే మధుమేహం ప్రమాదకారిగా మారింది. దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ఇది కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనివల్ల లక్షలాది మహిళలు తీవ్ర శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని తేల్చింది. చివరకు టైప్‌–2 (పెద్దవారిలో వచ్చే మధుమేహం)గా రూపుదాలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికలో పేర్కొంది. దీంతో ఏపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఏపీలో 14 నుంచి 17 శాతం మందికి..
► రాష్ట్రంలో ఏటా 6.5 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. ఇందులో 3 లక్షల మందికి పైగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటున్నారు.
► కేంద్రం తాజా లెక్కల ప్రకారం ఏపీలో 14 నుంచి 17 శాతం మంది గర్భిణులు మధుమేహానికి గురవుతున్నారని తేల్చారు.
► తమిళనాడు, తెలంగాణలో 17 నుంచి 20 శాతం మంది ఉన్నట్టు తేలింది. 

మధుమేహం వల్ల కలిగే నష్టాలివీ..
► గర్భిణిలో మధుమేహం ఉంటే పురిటి నొప్పులు సరిగా రావు. ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.
► ఇన్ఫెక్షన్లు సోకి తీవ్ర అనారోగ్యం బారిన పడటం, అబార్షన్లకు దారి తీయడం ఉంటాయి.
► కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే మరణించే ప్రమాదం ఉంది. పుట్టుకతోనే కొన్నిరకాల వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది.
► నియోనేటల్‌ హైపోగ్లైసీమియా లేదా రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌కు గురయ్యే ప్రమాదమూ ఉంది.

నియంత్రణ చర్యలిలా..
► ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు మధుమేహ నిర్ధారణ పరీక్షలు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
► మహిళ గర్భం దాల్చినట్టు నిర్ధారణ కాగానే మధుమేహ పరీక్ష చేస్తారు. అప్పుడు లేదని తేలితే 24 నుంచి 28 వారాల గర్భిణికి మరోసారి పరీక్ష చేస్తారు.
► ఒకవేళ డయాబెటిస్‌ ఉన్నట్టు తేలితే నిపుణులైన వైద్యులతో తగిన తక్షణ చికిత్సలు అందజేస్తారు. 
► అలాంటి వారిని ప్రతినెలా పర్యవేక్షణ చేసి.. దీనిని టైప్‌–2 డయాబెటిస్‌గా మారకుండా నియంత్రిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top