
రూ.37.92 లక్షల నగదు కూడా..
వివరాలు వెల్లడించిన హిందూపురం డీఎస్పీ మహేశ్
హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో జరిగిన భారీ చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సమయంలో బ్యాంకులో భారీ ఎత్తున నగలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హిందూపురం డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది, పోలీసులు విచారణ చేపట్టారు.
బ్యాoకు లాకర్‌లో ఉన్న దాదాపు రూ.12 కోట్ల విలువచేసే 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బ్యాంకు లాకర్ గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించినా కింది అర లాక్ తెరుచుకోలేదనీ, గట్టిగా ఉండటంతో తెరవలేక పోయారన్నారు. లేదంటే మరో పదికేజీల బంగారం కూడా చోరీకి గురయ్యేదన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రత్నం మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు.
నిర్లక్ష్యమే కారణమా?
అయితే ఈ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు లేకపోవడం, లోపల అలారం పనిచేయకపోవడం, సీసీ కెమెరాలను బ్యాంకు అధికారుల సెల్‌ఫోన్లకు అనుసంధానించకపోవడం వంటి లోపాలు వెలుగు చూశాయి. ఇటీవల తనిఖీల నిమిత్తం హిందూపురం రూరల్ సీఐ పారిశ్రామికవాడలో తనిఖీలకు వచి్చన సందర్భంగా బ్యాంకు భద్రతపై అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ పటిష్టం చేయాలని సూచించారు. అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు.