సుద్దపల్లిలో 2014–19 మధ్యే భారీగా అక్రమ క్వారీయింగ్‌ 

Massive illegal quarrying in Suddapalli between 2014-19 - Sakshi

గ్రావెల్‌ మాఫియా వల్ల 19 ప్రమాదకరమైన గోతులు

2019 నుంచి గ్రావెల్‌ మాఫియాపై ఉక్కుపాదం

2019–22 మధ్య  ఐదుగురిపై చర్యలు

అక్రమంగా క్వారీయింగ్‌ చేసిన 56,834 క్యూబిక్‌ మీటర్లకు రూ.2,06,63,127 జరిమానా 

డైరెక్టర్‌ ఆఫ్‌ మైనింగ్, జియాలజీ వీజీ వెంకటరెడ్డి వెల్లడి  

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామం పరిధిలో 2014–19 మధ్య కాలంలోనే భారీగా అక్రమ క్వారీయింగ్‌ జరిగిందని డైరెక్టర్‌ ఆఫ్‌ మైనింగ్, జియాలజీ (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. సుద్దపల్లిలో అక్రమ గ్రావెల్‌ క్వారీయింగ్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గురువారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన కీలక అంశాలను వెంకటరెడ్డి వివరించారు. 

చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి, ఇతర గ్రామాల పరిధిలో రహదారులు, నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన గ్రావెల్‌ నిల్వలు ఉన్నాయి. 2014–19 మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో ఒక్క సుద్దుపల్లిలోనే ప్రమాదకరమైన 19 గోతులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు ఎండిపోయాయి. సుద్దపల్లిలో 2014–19 మధ్య 3 వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌కు ఒక్క క్వారీకి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కానీ ఇష్టారాజ్యంగా క్వారీయింగ్‌ జరగ్గా, ఇద్దరికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. కేవలం 16,399 క్యూబిక్‌ మీటర్లకు రూ.33,28,769 జరిమానా విధించారు.

రాష్ట్రంలో మైనింగ్‌ అక్రమాలు, అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం విజిలెన్స్‌ స్క్వాడ్‌లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆకస్మిక దాడులతో మాఫియాకు ముక్కుతాడు వేస్తోంది. 2019–22 మధ్య సుద్దపల్లిలో కేవలం 4 క్వారీల ద్వారా 31,515 క్యూబిక్‌ మీటర్లకు తాత్కాలిక పర్మిట్‌లు జారీ అయ్యాయి. అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. మొత్తం 56,834 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ అక్రమ క్వారీయింగ్‌కు బాధ్యులైన వారికి భారీగా రూ.2,06,63,127 జరిమానా విధించారు.

అప్పుడు.. ఇప్పుడు
చేబ్రోలు మండలంలో 2014–19 మధ్య 3,46,716 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌కు 14 క్వారీలకు ప్రభుత్వానికి రూ.1,21,05,272 ఆదాయం వచ్చింది. 1,38,200 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ కోసం 4 లీజులకు రూ.42,05,070 వచ్చింది. ఆ ఐదేళ్ళలో అక్రమ తరలింపుపై 661 కేసులు పెట్టి రూ.1,08,24,898 జరిమానా విధించారు. అక్రమ క్వారీయింగ్‌పై 12 కేసులు పెట్టి  రూ.5,39,17,924 జరిమానా వసూలు చేశారు. 2019–22 కాలంలో 4,00,684 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌కు 48 తాత్కాలిక అనుమతులు ఇవ్వగా రూ.1,62,27,994 ఆదాయం వచ్చింది. అలాగే 42,198 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌కు 4 లీజులకు అనుమతి ఇవ్వగా రూ.30,28,860 ఆదాయం వచ్చింది. 2019–22 మధ్య అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న వారిపై 665 కేసులు నమోదు చేసి రూ.1,02,37,112 జరిమానా విధించాం. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై 23 కేసులు నమోదు చేసి రూ.8,13,05,703 జరిమానాగా వసూలు చేశాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top