మంగళగిరి టౌన్: ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన యువతిని ఓ వ్యక్తి పెట్ షాప్ ప్రమోషన్ పేరుతో విజయవాడకు పిలిపించాడు. మత్తుమందు కలిపిన నీళ్లు ఇచ్చి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం లైంగిక దాడి చేసి, నగదు బదిలీ చేయించుకున్నాడు. ఘటనపై బాధితురాలు మంగళగిరి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కడపకు చెందిన యువతి ఇన్‌స్ట్రాగామ్ ఖాతా నిర్వహిస్తూ సింగర్, యాంకర్‌గా ఆర్కెస్ట్రా ఈవెంట్లకు వెళుతుంటుంది. మూడు నెలల కిందట ఇన్‌స్ట్రాగామ్ ద్వారా విజయవాడకు చెందిన షేక్ జానీ పరిచయమయ్యాడు.
తనకు పెట్ షాప్ ఉందని, దాని ప్రమోషన్ కోసం రీల్స్ చేయాలని, విజయవాడకు వస్తే రూ.30 వేల పారితోíÙకం ఇస్తానని చెప్పడంతో ఆమె అంగీకరించింది. గతనెల 20న విజయవాడకు యువతి చేరుకుంది. మంగళగిరిలోని సాయిప్రియ రెసిడెన్సీకి వెళ్లి అక్కడ ఫ్రెష్ అవ్వాలని జానీ చెప్పాడు. తర్వాత వాటర్ బాటిల్‌లోని నీటిని తాగమని చెప్పాడు. దీంతో ఆమె నీరు తాగి స్పృహ కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. స్పృహ లేని సమయంలో తన నగ్న ఫొటోలు, వీడియోలు తీసినట్లు, స్పృహలోకి వచ్చిన అనంతరం వాటిని చూపించి బెదిరించినట్లు తెలిపింది. తన మాట వినకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని, చంపేస్తానని బెదిరించి తనను లైంగికంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించింది.
బెదిరించి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ..
అనంతరం తనకు డబ్బు ఇవ్వాలని బెదిరించడంతో రూ.16 వేల వరకు ఫోన్‌పే ద్వారా మూడు విడతల్లో బదిలీ చేయించుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఆమె ఇంటికి వెళ్లిన అనంతరం జానీ ఫోన్ చేస్తూ ఘటన గురించి ఎవరికైనా చెబితే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేయగా ఘటన మంగళవారం వెలుగుచూసింది.


