ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం

Mangalagiri MLA Alla Ramakrishna Reddy Father dies after illness - Sakshi

సాక్షి, పెదకాకాని/పేరేచర్ల: రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి దశరథరామిరెడ్డి(86)కి కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, అభిమానులు శుక్రవారం కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. పెదకాకాని సర్పంచిగానే కాక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం పాలకవర్గం చైర్మన్‌గా పనిచేసిన దశరథరామిరెడ్డి గ్రామ, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న దశరథ రామిరెడ్డి గుంటూరు సాయిభాస్కర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన సంగతి విదితమే. పెదకాకానిలోని ఆయన నివాసానికి గురువారం రాత్రి స్థానిక నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు చేరు కుని ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, పారిశ్రామికవేత్త పేరిరెడ్డిని పరామర్శించారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబులెన్స్‌లో దశరథరామిరెడ్డి భౌతికకాయం ఆయన నివాసానికి చేరుకుంది. దశరధరామిరెడ్డి సతీమణి వీరరాఘవమ్మ పెద్ద కుమారుడు అయోధ్యరామిరెడ్డి చేయి పట్టుకోగా భర్త భౌతికకాయంచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ‘అయ్యా వెళ్లిపోతున్నావా’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పెదకాకానిలో ప్రజల సందర్శనానంతరం భౌతికకాయాన్ని ఫిరంగిపురం మండలం, వేమవరంలోని ఆళ్ల వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అయోధ్యరామిరెడ్డి శాస్త్రోక్తంగా పూజా క్రతువు నిర్వహించి తండ్రి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, మహమ్మద్‌ ముస్తాఫా, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్, లింగంశెట్టి ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్‌గాంధీ, కళ్లం హరనాథరెడ్డి, మేరుగ విజయలక్ష్మి, డైమండ్‌ బాబు తదితరులు దశరథరామిరెడ్డి పార్ది్థవదేహానికి నివాళులర్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top