వేమగిరిలో దారుణ హత్య

A Man Was Brutally Murdered  In East Godavari - Sakshi

వివాహేతర సంబంధమే కారణమంటున్న పోలీసులు

నింధితుడు పరారీ

సాక్షి, కడియం: మండలంలోని వేమగిరిలో బొంతు వెంకన్న (45) అనే కూలీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన పితాని సత్యనారాయణ అలియాస్‌ అన్నమయ్య, భవానీ భార్యాభర్తలు. సత్యనారాయణ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భవానీ గ్రామంలోని హైవేపైగల ఒక ప్రముఖ డ్రగ్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. కాగా భవానీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన కూలి పనులు చేసుకొనే వెంకన్న ఆమెను మోటారు సైకిల్‌పై తీసుకువచ్చి ఇంటి వద్ద దింపుతుండేవాడు. ఈ క్రమంలోనే సత్యనారాయణకు భార్యపై అనుమానం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. ఇదే విషయంపై గతంలో కూడా సత్యనారాయణ, వెంకన్నల మధ్య వివాదం కూడా చోటు చేసుకుందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఎప్పటి మాదిరిగానే శనివారం రాత్రి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న భవానీని వెంకన్న తన మోటారు సైకిల్‌పై తీసుకువస్తున్నాడు. వీరిని గమనించిన సత్యనారాయణ వారిని వెంబడించి గ్రామానికి సమీపంలోని ఒక నర్సరీ వద్ద కాపు కాశాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో వెంకన్న, భవానీలపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. మృతుడు వెంకన్న మెడ, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీపై కూడా దాడి చేయడంతో ఆమె మెడ భాగంలో గాయమైంది. అక్కడి నుంచి భవానీ పరుగు పెడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు భవానీని రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు కడియం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. శ్రీధర్‌కుమార్‌ తన సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. దక్షిణ మండలం డీఎస్పీ ఎం. శ్రీలత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  దాడికి పాల్పడిన ఎం.సత్యనారాయణ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. అతడు పనిచేసే మండపేట ప్రాంతానికి చెందిన లారీ యజమానిని కూడా పోలీసులు ఆరా తీసారు. అయితే అతని ఆచూకీ ఇంకా లభించలేదు. విషయం తెలుసుకున్న మృతుడు బొంతు వెంకన్న కుటుంబ సభ్యులు ఆతృతగా ఘటనా ప్రాంతానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top