మలేరియా 'పంజా' | Malaria cases are increasing day by day | Sakshi
Sakshi News home page

మలేరియా 'పంజా'

Apr 8 2026 5:03 AM | Updated on Apr 8 2026 5:03 AM

Malaria cases are increasing day by day

రోజురోజుకూ పెరుగుతున్న  మలేరియా కేసులు 

అల్లూరి జిల్లాలో 3 నెలల్లో 210 మందికి జ్వరాలు   

నివారణ చర్యలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం 

రెండేళ్లుగా పంపిణీ కాని దోమ తెరలు 

అల్లూరి జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య రోజు రోజుకూపెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో పాటు పారిశుధ్యలోపం వల్ల  దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోవడంతో మలేరియా నివారణ చర్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లాలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి.దోమల బెడద అధికంగా ఉండడంతో  ప్రజలు దోమకాట్లకు గురవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మలేరియా నివారణ చర్యలు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో  రెండేళ్ల నుంచి  దోమతెరలు పంపిణీ చేయలేదు. గత ఏడాది నుంచి దోమతెరలు పంపిణీ చేస్తామని  ప్రభుత్వ పెద్దలు,అధికారులు ప్రకటిస్తున్నా ఆచరణలో చూపకపోవడంతో  ప్రజలకు దోమకాట్లు తప్పడం లేదు.మలేరియా జ్వరాల వ్యాప్తితో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కొన్నిగ్రామాల్లోనే దోమల మందు పిచికారీ 
అల్లూరి జిల్లాలో  35 ఆరోగ్య కేంద్రాల పరిధిలో 3,500 గ్రామాలు ఉన్నాయి.  వీటిలో  మలేరియా పీడిత 1,600 గ్రామాలకే దోమల నివారణ మందు పిచికారీ పరిమితం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దోమల వ్యాప్తి ప్రతి ఏటా అధికంగా ఉంది. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండడం, పారిశుధ్యం లోపించడంతో  దోమలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది కూడా  మలేరియా పీడిత గ్రామాల్లో మాత్రమే  దోమ ల నివారణ మందు పిచికారీకి మలేరియాశాఖ ఏర్పా ట్లు చేస్తోంది.  అన్ని గ్రామాల్లో దోమల నివార ణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో... 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కుటుంబాలకు  దోమతెరలను పంపిణీ చేశారు. 2021లో అప్పటి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మలేరియా జ్వరాల తీవ్రతపై సకాలంలో స్పందించారు.కేంద్ర ప్రభుత్వం ఆ«దీనంలోని  నేషనల్‌ వెక్టర్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం సంస్థ(ఎన్‌వీబీడీసీపీ)నుంచి రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటీడీఏల పరిధిలో ప్రజలకు పంపిణీ చేసేందుకు 6,22,050 దోమ తెరలను రప్పించారు. 

మూడేళ్ల కాలపరిమితి పూర్తికావడంతో దోమతెరలకు చిరిగిపోయాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎపిడిమిక్‌ సీజన్‌లో కొత్త దోమతెరల పంపిణీకి చర్యలు తీసుకోలేదు. ఐదు లక్షల వరకు దోమతెరలు పంపిణీ చేస్తామని ప్రకటించి, మిన్నుకుండిపోయారు. దీంతో  ప్రజలు  మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు. గత రెండేళ్లుగా  దోమతెరలు పంపిణీ జరగకపోగా,ఈఏడాది కూడా ఎపిడిమిక్‌ సీజన్‌ ప్రారంభమైనా అదే పరిస్థితితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

210 కేసులు
అల్లూరి జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1,600 గ్రామాలను  మలేరియా పీడిత ప్రాంతాలుగా మలేరియాశాఖ గుర్తించింది. ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 71,171మంది జ్వర పీడితులకు రక్తపరీక్షలు జరపగా 210 మంది మలేరియా బారినపడినట్టు గుర్తించి వైద్యసేవలు అందజేశారు. ప్రస్తుతం పాడేరులోని జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి, ముంచంగిపుట్టు, చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రులు,  అన్ని  పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.  

ప్రైవేట్‌ ఆస్పత్రులకు మలేరియా రోగుల తాకిడి అధికంగా ఉంది.  మైదాన ప్రాంత ఆస్పత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. 2024లో 4,46,114 మంది జ్వర పీడితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 2,361 మలేరియా కేసులు, 2025లో 4,43,917మంది జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 1,678 మలేరియా కేసులు నమోదయ్యాయి.మలేరియా జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ దోమతెరల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలకు కాలం చెల్లడంతో చిరుగులు ఏర్పడ్డాయి.ప్రస్తుత ప్రభుత్వం కొత్త దోమతెరల పంపిణీ ఇండెంట్‌కే పరిమితం చేసింది.

అన్ని గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేయాలి 
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయాలి.మలేరియా పీడిత గ్రామాలకే దోమల నివారణ మందు పిచికారీ పరిమితం చేయడం సమంజసం కాదు.మలేరియా కేసులు నమోదైన గ్రామాల్లో ఇంటింటా వైద్యపరీక్షలు నిర్వహించాలి.అన్ని వర్గాల ప్రజలకు కొత్త దోమతెరలు పంపిణీ చేయాలి.  – పొద్దు బాలదేవ్, గిరిజన సంఘం నేత, అరకులోయ 

మలేరియా  జ్వరాలపై నిర్లక్ష్యం తగదు 
గిరిజన ప్రాంతాల్లో కీటక జనిత వ్యాధులైన మలేరియా,డెంగ్యూ వంటి జ్వరాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు.గిరిజనుల వద్ద దోమతెరలకు చిరుగులు ఏర్పడడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజలు దోమకాట్లతో మలేరియా జ్వరాల బారిన పడుతున్నా చంద్రబాబుసర్కార్‌ కొత్త దోమతెరల పంపిణీకి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం.రెండేళ్లుగా మలేరియా తీవ్రత అధికంగా ఉంది.అన్ని గ్రామాల్లోను దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటు దోమతెరలు పంపిణీ చేయాలి.       –మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరు 

దోమ తెరల పంపిణీకి చర్యలు  
జిల్లాలో 5.30 లక్షల  కొత్త దోమతెరల పంపిణీకి గతంలోనే ఇండెంట్‌ పెట్టాం.ఇటీవల 34వేల కొత్త దోమతెరలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.వచ్చే నెల నాటికి రెండవ విడతలో  దోమతెరలన్నీ రాగానే ప్రజలకు పంపిణీ చేస్తాం.ఈనెల 15వతేదీ నుంచి 1600 గ్రామాల్లో దోమల నివారణ మందు మొదట విడత  పిచికారీ పనులు ప్రారంభిస్తాం.       –తులసి, జిల్లా మలేరియాశాఖ అధికారి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement