పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి

Make extensive arrangements for exams - Sakshi

అన్ని పరీక్షలను సమర్థంగా నిర్వహించాలి 

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు

కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులకు మంత్రి బొత్స ఆదేశం 

టెన్త్, ఇంటర్, టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష

సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలతోపాటు పదో తరగతి,  ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి  సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా,  ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయ­వాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఒకటి నుంచి ఇంటర్, 18 నుంచి పది పరీక్షలు
ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 47,921 మంది అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్‌ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు, మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరికోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు వివరించారు. వీరితోపాటు పరీక్షలకు రీ ఎన్‌రోల్‌ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 682 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ సిద్ధం చేసినట్టు తెలిపారు.

ఓపెన్‌ స్కూలుకు సంబంధించి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్‌ టెన్త్‌లో 34,635 మంది విద్యార్థులు ఉండగా, 176 కేంద్రాలు, ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు 76,572 మంది ఉండగా, 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు.

పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు.

27 నుంచి ఏపీ టెట్‌
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్‌కు 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్సీ నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్, ఇంటర్మీడియెట్‌ విద్య కమిషనర్‌ సౌరభ్‌ గౌర్, పాఠశాల విద్య డైరెక్టర్‌ పార్వతి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి, పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి, ఏపీ టెట్‌ జేడీ మేరీచంద్రిక, ఏపీ మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఎంవీ కృష్ణారెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top