
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు పంటలను కాపాడుకునే పనుల్లో నిమగ్నమైనందున రైతు భరోసా కేంద్రాల్లో పేర్ల నమోదును ఈ నెల 25 వరకూ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
పత్తి రైతులకూ అవకాశం: ఈ ఏడాది నుంచి పత్తి రైతులు కూడా తమ పేర్లను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని పంటను అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కొత్తగా టైమ్‌స్లాట్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. పేరు నమోదు చేసుకున్న రైతుకు ముందుగా (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సీసీఐ కూపన్లు జారీచేస్తుంది. ఆ కూపన్లలో పేర్కొన్న కొనుగోలు కేంద్రానికి, కేటాయించిన టైమ్‌లో రైతులు పత్తిని తీసుకెళ్లాలి. ఒక వేళ ఆ టైమ్‌లోగా పంట తీసుకెళ్లకుంటే మరోసారి టైమ్‌స్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది. పత్తికి క్వింటాలుకు రూ.5,825ను మద్దతు ధరగా సీసీఐ ప్రకటించింది.