ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ

Mahasamproksana Began In Tirumala - Sakshi

శ్రీ వ‌రాహ‌స్వామి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

సాక్షి, తిరుమల: శ్రీవ‌రాహ‌స్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబ‌రు 10న మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో 20 మంది ప్ర‌ముఖ రుత్వికులు 13హోమ‌గుండాల‌లో విశేష హోమాలు నిర్వ‌హించ‌నున్నారు.  నేడు ఉదయం 7.00 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 

కళాకర్షణ :
రాత్రి 8.00 నుండి 10.00 గంటల వ‌ర‌కు  కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.

డిసెంబ‌రు 7, 8, 9వ తేదీల్లో :
ఉద‌యం 7 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ర‌ల రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు విశేషహోమాలు, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. 

డిసెంబరు 10న:
ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. వ‌రాహ‌స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు అమర్చేందుకు బాలాల‌యం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం పూర్త‌య్యే వ‌ర‌కు భ‌క్తుల‌కు వ‌రాహ‌స్వామి వారి మూల విరామూర్తి ద‌ర్శ‌నం ఉండ‌దు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top