ప్రాంతానికో ఉప లోకాయుక్త

Lokayukta Justice Lakshman Reddy On Deputy Lokayukta - Sakshi

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ

లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి వెల్లడి 

బి.కొత్తకోట: రాష్ట్ర లోకాయుక్తలో 5 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి చెప్పారు. వీటిని పరిష్కరించి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మూడు ఉప లోకాయుక్తలను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మూడేళ్లు లోకాయుక్త నియామకం జరగలేదని, దీనితో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా, న్యాయవాది అవసరం లేకుండా ఫిర్యాదులకు న్యాయం చేస్తామని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

బోగస్‌ ఫిర్యాదులకు ఆధార్‌తో చెక్‌..
బోగస్‌ ఫిర్యాదుల వల్ల తమ విలువైన సమయం వృథా అవుతోందని, వీటిని నివారించేందుకు ఫిర్యాదుదారు ఫొటో, ఆధార్‌ నంబర్‌ జత చేసేలా నిబంధన విధించాలని ఆలోచిస్తున్నామని జస్టిస్‌ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం రూ.50 లక్షలకు మించకూడదనే నిబంధన ఉందని,  ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇచ్చే పద్ధతి పాటించకుండా అందరినీ సమంగా చూసే విధంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చామని తెలిపారు.

పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ బాధ్యత రెవెన్యూ శాఖకు ఉందని, దీనిపై 2011లో జారీ అయిన జీవో అమలుకావడం లేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారిక కమిటీలు సమావేశాలు, సమీక్షలు జరిపి ఆస్తులను కాపాడాలని కలెక్టర్లకు లేఖలు రాశామన్నారు. హార్సిలీహిల్స్‌ సహకార గృహ నిర్మాణ సంఘానికి ప్రభుత్వం విక్రయించిన భూమి ఏ స్థితిలో ఉంది, భూమి కేటాయింపు, ఆక్రమణలపై సమగ్ర విచారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్టు భూ పరిహారం, నిర్వాసితులకు అందాల్సిన ఆర్థిక సహాయంపై బోగస్‌ లబ్ధిదారులు పుట్టుకొచ్చినట్టు ఫిర్యాదులు అందాయని, దీనిపై పోలవరంలో క్యాంపు ఏర్పాటు చేసి విచారణ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమైనట్టు ఆ శాఖ కమిషనర్‌ నివేదిక ఇచ్చారని, దీనిపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పారు. లోకాయుక్తకు చేసే ఫిర్యాదుల విషయంలో దళారులను అశ్రయించవద్దని కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top