'కొబ్బరి రైతుల పట్ల మరింత బాధ్యతగా ఉన్నాం'

Kurasala Kannababu Attended Webinar Conducted By Coconut Research Center - Sakshi

కొబ్బరి రైతులకు మేలు చేసే దిశలో చర్యలు

సహాయకారిగా నిలవనున్న కొబ్బరి పరిశోధనా కేంద్రం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడి

కొబ్బరి పరిశోధనా కేంద్రం వెబినార్‌లో మంత్రి

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొబ్బరి సాగు, ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రం నిర్వహించిన వెబినార్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుక్రవారం విజయవాడ నుంచి పాల్గొన్నారు. కొబ్బరి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

కొబ్బరి నామ సంవత్సరం : 
డాక్టర్‌ వైయస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ ఏడాది (2020–21)ని కొబ్బరి సంవత్పరంగా ప్రకటించిన నేపథ్యంలో కొబ్బరి రైతుల పట్ల ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు వెల్లడించారు. కొబ్బరి రైతులకు మేలు చేసేందుకు అంబాజీపేట పరిశోధన కేంద్రం ద్వారా పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రక్రియలో రైతులకు కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎంతో సహాయకారిగా నిలవనుందని చెప్పారు. (చదవండి : సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం) 

నాణ్యమైన పరిశోధనలు : 
కొబ్బరి రైతుల ఆదాయం పెరగడంతో పాటు, ఉత్పత్తిలో వారు ఇతర రాష్ట్రాల రైతలతో పోటీ పడే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం మరింత నాణ్యమైన పరిశోధనలు జరపాలని మంత్రి కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాలని ఆయన అన్నారు.

సమస్యలపై దృష్టి :
గ్రామాలలో అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తోన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) వద్ద ఉన్న వ్యవసాయ సహయకుల ద్వారా కొబ్బరి రైతుల సమస్యలను తెలుసుకోవాలని కొబ్బరి పరిశోధన కేంద్రానికి మంత్రి కన్నబాబు సూచించారు. అదే విధంగా ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపాలని ఆయన కోరారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1953లో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం, ఇన్నేళ్లుగా రైతులకు సేవలందిస్తోందని మంత్రి ప్రశంసించారు. దశాబ్ధాలుగా సంస్థ పరిశోధనలు కొనసాగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన గంగా బొండాం రకాన్ని జాతీయ స్థాయిలో గతంలో ‘గౌతమి గంగ’ గా విడుదల చేశారని గుర్తు చేశారు.కొబ్బరిలో పురుగుల నివారణకు కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందుల వినియోగాన్ని ఈ పరిశోధన కేంద్రం రూపొందించగా, ఆ పద్ధతి రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని మంత్రి తెలిపారు. కొబ్బరి తోటల సాగులోనూ ఆ విధానం చౌకగానూ, సమర్ధవంతంగానూ నిల్చిందని చెప్పారు.

కొబ్బరి ఉత్పత్తిలో మన స్థానం :
కొబ్బరి ఉత్పత్తిలో దేశ వ్యాప్తంగా రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉండగా, కొబ్బరి ఉత్పాదకత రంగంలో తొలి స్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. కొబ్బరి ఉత్పత్తిలో కూడా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేసి, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వ చర్యలు :
కొబ్బరిలో మేలైన రకాల ఉత్పత్తి సాధించడం, ఉత్తమ యాజమాన్యం ద్వారా దిగుబడి, నాణ్యత పెంచడంతో పాటు, కొబ్బరి రకాలకు తగిన యాజమాన్య పద్ధతులను రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. అదే విధంగా రైతులకు ఆధునిక ఉద్యాన పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

జీవ నియంత్రణపై పరిశోధనలు :
జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడ పీడలు, తెగుళ్ల నివారణపై పరిశోధనతో పాటు, తెల్లదోమ నివారణకు జీవ నియంత్రక శిలీంధ్రం (ఇసారియా), మిత్ర పురుగులు (ఎక్కార్సియా డైకో కైసా)పై రైతులకు అవగాహన కల్పిస్తామని వెబినార్‌లో పాల్గొన్న డాక్టర్‌ వైయస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరామ్‌ తెలిపారు. మిత్ర పురుగులను ఎక్కువ సంఖ్యలో రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. కొబ్బరిని కొత్తగా ఆశిస్తున్న పురుగులు, తెగుళ్ళను జీవ నియంత్రణ ద్వారా సమర్ధవంతంగా నివారించే ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ వెబినార్‌లో హార్టికల్చర్‌ కమిషనర్‌ చిరంజీవి చౌదరి తదితరులు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top