డిజిటల్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి 

KS Jawahar Comments On Digital Frauds - Sakshi

ప్రజలకు సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి సూచన 

సాక్షి, అమరావతి: డిజిటల్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన 27వ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్, ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల మోసాల విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈ మోసాలను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్, హీరా, కపిల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలు, సహారా, ప్రగతి, అవని, ఆదర్శ్‌ తదితర కోఆపరేటివ్‌ సొసైటీలకు సంబంధించిన కేసుల ప్రగతిపైనా సమావేశంలో చర్చించారు.

కేసులను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సీఎస్‌ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ జనరల్‌ మేనేజర్‌ ఇన్‌చార్జ్‌ అంజనీ మిశ్రా, డీజీఎం రూటా మహాపాత్ర, ఉన్నతాధికారులు ఎస్‌ఎస్‌ రావత్, కేవీవీ సత్యనారాయణ, విజయకుమార్, సత్య ప్రభాకరరావు, విజయవాడ ఏసీపీ సీహెచ్‌ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top