‘కృష్ణా, గోదావరి’ గెజిట్‌ అమల్లో ముందడుగు

Krishna And Godavari Board Central Gazette Implementation Two States Acceptance - Sakshi

ఉప సంఘాల సమావేశాల్లో వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం 

ఇప్పటికే ప్రాజెక్టుల వివరాలన్నీ అందజేసిన ఏపీ అధికారులు

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులో ముందడుగు పడింది. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల వివరాలన్నీ తక్షణమే ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డులు ఆదీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నది తేలాకనే సీఐఎస్‌ఎఫ్‌ భద్రతపై చర్చిద్దామని తెలిపాయి. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌ మనీగా డిపాజిట్‌ చేసే అంశాన్ని ప్రభుత్వాలతో చర్చించాకనే వెల్లడిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాలు ఇచ్చే అంశాల ఆధారంగా బోర్డు స్వరూపాలను ఖరారు చేసి బోర్డులకు అందజేస్తామని ఉపసంఘాల కన్వీనర్‌లు తెలిపారు. బోర్డు పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు వేర్వేరుగా కృష్ణా, గోదావరి బోర్డులు ఉపసంఘాలను నియమించాయి. ఈ రెండు ఉపసంఘాలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా సమావేశమయ్యాయి. కృష్ణా బోర్డు ఉప సంఘానికి రవికుమార్‌ పిళ్‌లై, గోదావరి బోర్డు ఉప సంఘానికి బీపీ పాండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఉప సంఘాల సమావేశాల్లో బోర్డు సభ్యులు, ఏపీ అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సీఈ మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

23లోగా వివరాలు ఇవ్వాల్సిందే 
తొలుత కృష్ణా బోర్డు ఉప సంఘం సమావేశం జరిగింది. ప్రాజెక్టుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అందజేసింది. తెలంగాణ అధికారులు ఈనెల 23లోగా ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫరి్నచర్‌తో సహా అన్ని వివరాలను అందిస్తూనే వాటి పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను అందజేయాలని ఉపసంఘం కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్‌లై ఆదేశించారు.

వాటితోపాటే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటిని విడుదల చేసేటప్పుడు లెక్కిస్తున్న నేపథ్యంలో.. దాని దిగువన ఉన్న బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ సీఈ శ్రీనివాసరెడ్డి చెప్పగా.. తెలంగాణ సీఈ మోహన్‌కుమార్‌ వ్యతిరేకించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు అన్ని వివరాలు అందజేయాలని కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్‌లై కోరారు.  

20న మళ్లీ గోదావరి  బోర్డు ఉపసంఘం భేటీ
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు అందజేశారు. తెలంగాణ అధికారులు ఇప్పటిదాకా ప్రాజెక్టుల వివరాలు ఇవ్వకపోవడంతో.. తక్షణమే అందజేయాలని గోదావరి బోర్డు ఉపసంఘం కన్వీనర్‌ బీపీ పాండే ఆదేశించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను అక్టోబర్‌ 14 నుంచి అమలు చేయాల్సిన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపాన్ని తక్షణమే ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో 20న మళ్లీ ఉపసంఘం సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top