ఎన్టీ రామారావు నటించిన ఓ సినిమాలో ‘‘కోర్టు కోర్టుకు ఒక తీర్పు...’’ అంటూ ఓ పాటుంది. అప్పట్లో సూపర్‌హిట్ ఈ పాట. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు గమనిస్తే... ఈ పాట మరోసారి గుర్తుకురాక మానదు. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. 2019-2024 మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషును ప్రవేశపెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే... తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర పార్టీలు నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూనే వారికి కావాల్సిన మాధ్యమంలో చదువుకునే వెసలుబాటూ కల్పించారు. ఇందుకోసం ఆంగ్లం, తెలుగు భాషలు రెండింటిలోనూ పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.
విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవ చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు తెలుగు భాషకు ఛాంపియన్ల మాదిరి వాదించారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడితే అవమానించిన టీడీపీ పెద్దలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు.
అయితే ప్రజలలో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేలలో వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థం అయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరి పిల్లలు, లేదా మనుమళ్లు ఆ మీడియంలో చదవడం లేదు. అంతా పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తుంటారు.ఈ విషయాలన్ని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించారనిపిస్తుంది.
రాజకీయ దురుద్దేశాలతో కొందరు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పట్లో విచారణ చేసిన హైకోర్టు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో లను రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అక్కడ వాదోపవాదాలు చాలాకాలం సాగాయి.అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం యధావిధిగా, ఆంగ్ల మీడియం విషయంలోను యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన భాషగా ఆంగ్లం ఉంటుందని గత నెల 16న ఒక ఆదేశం జారీ చేసింది.
దీనిపై ఫ్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాలలో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరిని ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇంతర రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.
మంచి పరిణామమంటూ వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్లభాషను పొరపాటున బోధన భాషగా పేర్కొన్నామని, ఆ ప్రొసీడింగ్స్‌ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాష విధానం అమలలో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్థకమని తేల్చేసింది.
జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు ఇదే హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలిబుచ్చింది. అంతేకాక సంబంధిత జీవోను కూడా కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినా ద్విభాష విధానాన్నే ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీషులో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి.
అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైఎస్సార్‌సీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజలలో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలను, పాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడంలేదు. జగన్ టైమ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదానిని రాజకీయం చేసి,ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం చిమ్మిన సంగతి ఒకటికి ,పదిసార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియం గా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ ను చూపితే, అప్పట్లో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తదితరలు సంకుచితంగా వ్యవహరించారు.ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


