చినబాబు కళ్లలో ఆనందం కోసం పూడి శ్రీహరిపై కక్ష సాధింపు చర్యలు
బెయిలబుల్ కేసుల్లో అర్ధరాత్రి వేధింపులు
పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి కోర్టులో హాజరుపర్చకుండా కాలయాపన
శ్రీహరి, గిరీష్‌లను మానసికంగా వేధించి పైశాచికం
జిల్లా పోలీసు బాస్ కనుసన్నల్లోనే ప్రణాళిక అమలు
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చినబాబు కళ్లలో ఆనందం కోసం శ్రీహరిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయన అరెస్టుపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. ఇదే కేసులో అరెస్టయిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా నేత గిరీష్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించేందుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు.
శ్రీహరిని ఎలాగైనా కస్టడీకి తరలించాలని భావించి రాత్రంతా కుప్పం పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. కోర్టులో హాజరుపరిచే విషయంలో కుంటిసాకులు చెబుతూ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో శ్రీహరిని అరెస్టు చేసిన 33 గంటల తర్వాత గురువారం సాయంత్రం కుప్పం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శ్రీహరిని విడుదల చేయక తప్పని పరిస్థితి తలెత్తింది.
పత్రిక క్లిప్పింగ్‌ను పార్టీ గ్రూపులో పంచుకున్నారని..
పత్రికలో ప్రచురితమైన ఓ క్లిప్పింగును తమ పార్టీ గ్రూపులో శ్రీహరి పంచుకున్నారు. దీనిపై కుప్పం ఐ.టీడీపీ నేత నుంచి 13న రాత్రి 10 గంటలకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై పరుగులు తీశారు. 14వ తేదీన రాత్రి అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్లి వైఎస్సార్‌సీపీ సోషల్ యాక్టివిస్ట్ గిరీష్ రెడ్డిని, 15న ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో పూడి శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు హుటాహుటిన కుప్పం తీసుకొచ్చారు.
కేవలం చినబాబు కళ్లల్లో ఆనందం చూడటానికి జిల్లా పోలీసు బాస్ ప్రణాళికలో స్థానిక పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. శ్రీహరిని ఓ తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా వలపని అరెస్టు చేసిన పోలీసులు ఆయన వద్ద ఉన్న ఫోన్, ల్యాప్‌టాప్ స్వా«దీనం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో తాడేపల్లి నుంచి కుప్పం తీసుకొచ్చారు. ఏ–1 నిందితుడిగా గిరీష్ కుమార్‌రెడ్డిని, ఏ–2గా శ్రీహరిని చూపించిన పోలీసులు వేధింపులే లక్ష్యంగా ముందుకెళ్లారు. తొలుత గిరీష్ ను బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో కుప్పం కోర్టులో హాజరుపర్చారు.
అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో రిమాండ్ ఇవ్వడం కుదరదని గిరీష్‌కు జ్యుడీషియల్ కస్టడీని న్యాయమూర్తి తిరస్కరించారు. సొంత పూచీకత్తుపై గిరీష్ ను విడుదల చేశారు. ఈ ఘటనతో పోలీసుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయితే, చినబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో శ్రీహరిని మానసికంగా వేధించి, స్టేషన్‌లో ఉంచి మరుసటి రోజు కోర్టుకు తీసుకెళ్లాలని పోలీసు బాస్ నుంచి సమాచారం అందింది. దీంతో రాత్రంతా శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.
ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైఎస్సార్‌సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు వైద్యపరీక్షలు నిర్వహించినా.. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లోనే ఉంచేశారు. ఇలా గంటల కొద్దీ శ్రీహరిను స్టేషన్‌లో ఉంచి పైశాచిక ఆనందం పొందారు. చివరకు సాయంత్రం 4.30 గంటలకు కుప్పం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, ఆపై సాయంత్రం 5 గంటలకు కుప్పం కోర్టులో హాజరుపరచారు.
ఆ వారెంట్ల పరిస్థితి ఏమిటి?
శ్రీహరి, గిరీష్‌లపై నమోదు చేసిన కేసుల్లో కనీసం 41ఏ నోటీసులు కూడా ఇవ్వని పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అతి సాధారణ ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై కక్షసాధించేందుకు యత్నించారు.
అయితే, జిల్లాలో హత్యలు, దోపిడీలు, అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉండి.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేశాయి. జిల్లాలో దాదాపు 280కి పైగా నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారెవరినీ కోర్టులో హాజరుపరిచేందుకు సమయం లేదని చెబుతున్న పోలీసులు.. ప్రతిపక్ష నేతలను మాత్రం అప్పటికప్పుడు అరెస్టు చేయడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


