కార్తీక పౌర్ణమి: దేదీప్యం.. ఇంద్రవైభోగం

Karthika Deepotsavam Programme In Visakhapatnam - Sakshi

సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): కోటి కార్తిక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లు.. కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమరపిస్తూ దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం  స్వా మిజీ పూజలు నిర్వహించి.. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కోటి ఒత్తుల భారీ దీపాన్ని వెలిగించారు.

 

ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం 
కోటి దీపోత్సవానికి విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్, దుర్గగుడి చైర్మన్‌ పైలాసోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శనానంతరం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.  

 

పుష్పాలతో రంగవల్లులు 
కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పుష్పాలతో శ్రీచక్రాన్ని తీరిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, మహా గణపతి ప్రాంగణం, మల్లేశ్వర స్వామి వారి ఆలయం, మహా మండప, కనకదుర్గనగర్‌లో దీపాలను ఏర్పాటు చేయగా, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలా తోరణాన్ని  అర్చకులు వెలిగించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top