న్యాయం చేయాల్సిన పోలీసులదీ అదే తీరు
జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న ఇల్లాలు
సాయం కోరితే నేతల వెక్కిరింపులు
కుమిలిపోతున్న బాధిత కుటుంబీకులు
ఆమె పేరులో ఉన్న ‘కళ’ను జీవితంలో లేకుండా చేశారు. వేధించి, దాడి చేసి, అవమానపరచి జీవచ్ఛవంలా మార్చేశారు. ఇంత జరిగినా వారి ఆక్రోశం మాత్రం చల్లారలేదు. ఇంకా వేధిస్తూనే ఉన్నారు. కాస్త దయ చూపమంటూ ‘పెద్ద’లను ఆశ్రయిస్తే పట్టించుకోలేదు.. సరికదా వెక్కిరిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన ఖాకీలు దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతుండడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన చంద్రకళ, చిన్నా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం కాగా, కుటుంబం సంతోషంగా జీవనం సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్నుపడింది. కోరిక తీర్చాలంటూ వెంటపడడం ప్రారంభించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలంటూ రామాంజినేయులును చంద్రకళ హెచ్చరించింది. విషయం తెలుసుకున్న రామాంజినేయులు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. రామాంజినేయులు భార్య లక్ష్మీ , బంధువులు గాయత్రి, రామకృష్ణ, శిరీష, రమేష్ కలిసి చంద్రకళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. విషయంపై బాధితులు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన చంద్రకళ ఎనిమిది నెలల క్రితం ఇంట్లో యాసిడ్ తాగింది.
జీవచ్ఛవంలా..
కుటుంబ సభ్యులు వెంటనే చంద్రకళను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. దాదాపు 8 నెలలు వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడిన చంద్రకళ ప్రాణం ఎలాగోలా నిలిచింది. అయితే, అప్పటికే ఆస్పత్రిలో చికిత్సల కోసం బాధిత కుటుంబం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసింది. దొరికిన చోటల్లా అప్పు చేసి, ఉన్నవన్నీ కుదువ పెట్టి డబ్బు సమకూర్చారు. అయితే, ఇంకో రూ. 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో దిక్కుతోచలేదు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రకళ ప్రస్తుతం నేరుగా ఆహారం తీసుకోలేకపోతోంది. బాగా చిక్కిపోయి జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందిస్తున్నారు.
అలా చేస్తేనే సాయమట!
ఇటీవల బాధితురాలి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆశ్రయించారు. అయితే, బాధితులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని తెలుసుకున్న ఆయన.. టీడీపీలోకి వస్తే వైద్య ఖర్చులకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యత్నించగా ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుకోండి’ అంటూ టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారని చంద్రకళ కుటుంబ సభ్యులు వాపోయారు.
పట్టించుకోని పోలీసులు..
చంద్రకళ ఫిర్యాదు చేసిన సమయంలో పట్టించుకోని పోలీసులు.. ఆమె యాసిడ్ తాగాక అప్రమత్తమై టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి, గంటలోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను పంపించేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ప్రశి్నస్తే.. తమకు ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని, విసిగించకుండా వెళ్లిపోవాలంటూ హెచ్చరించారని వారు వాపోతున్నారు.
ఆగని వేధింపులు...
తమ పార్టీ నాయకులపై పెట్టిన కేసుకు సంబంధించి చంద్రకళ కుటుంబీకులపై ఇటీవల టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్నట్లు తెలిసింది. కేసు రాజీ కావాలంటూ టీడీపీ నేతలు తిమ్మరాజు, వైపీ రమేష్ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. చెప్పినట్లు వినకుంటే మీరే దాడి చేశారంటూ ఫిర్యాదు చేయించి మీపైనే కేసు నమోదు చేయిస్తామని వేధిస్తుండడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
కాపాడండి..
నా కుమార్తెపై టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. వారు ఎలా చెబితే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నా కుమార్తె జీవితం చిన్నాభిన్నమైంది. అయినా టీడీపీ నేతలు, పోలీసులు వేధింపులు ఆపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. దయ ఉన్న మారాజులు స్పందించి నా కుమార్తె ఆస్పత్రి ఖర్చులకు సాయం చేయాలని చేతులు జోడించి కోరుతున్నా.
– బయన్న, చంద్రకళ తండ్రి


