పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో రాయదుర్గం జనసేన ఇన్‌చార్జ్ మంజునాథ్
పురుగుమందు తాగడంతో ప్రాణాపాయస్థితిలో బళ్లారి విమ్స్ ఐసీయూలో చికిత్స
డబ్బు పంచాయితీలో ‘దుర్గం’ జనసేన ఇన్‌చార్జ్ మంజునాథ్‌కు పోలీసుల వత్తాసు
సిద్ధప్ప అనే వ్యక్తిని పిలిచి చితకబాది ట్రాక్టర్లు, బొలెరోలు స్టేషన్‌కు తెచ్చిన వైనం
అతడి తండ్రి బండ్రావప్పతో ఖాళీ అగ్రిమెంట్లపై సంతకాలు, రూ.10 లక్షలు వసూలు
ఈ పరిణామాలతో అవమాన భారానికి గురై పురుగుమందు తాగిన బండ్రావప్ప
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కూటమి’ ప్రభుత్వ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్యకు యత్నించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన ఇన్‌చార్జ్ మంజునాథ్‌కు మద్దతుగా పోలీసులు చేసిన ఈ చర్య ‘అనంత’లో కలకలం రేపుతోంది. మంజునాథ్‌కు రాయదుర్గం, కర్ణాటక సరిహద్దు బండ్రావి అనే గ్రామంలోని రాగుల సిద్ధప్పకు మధ్య నగదు లావాదేవీలున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలలో మంజునాథ్‌కు సిద్ధప్ప బాకీ పడ్డాడు. ఈ క్రమంలో మంజునాథ్ సిఫార్సుతో రాయదుర్గం పోలీసులు సిద్ధప్పను అదుపులోకి తీసుకున్నారు. అతడిని వేధించడంతో పాటు రెండు రోజులు చిత్తకొట్టినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగక సిద్ధప్పకు సంబంధించిన రెండు ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలను కూడా స్టేషన్‌కు తెప్పించారు.

సిద్ధప్ప తండ్రి బండ్రావప్పను సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ గురుప్రసాద్ పిలిపించారు. డబ్బుల విషయమై ఒత్తిడి చేశారు. దీంతో వారికి బండ్రావప్ప రూ.10 లక్షలిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.లక్ష వారు తీసుకుని, రూ.9 లక్షలు మంజునాథ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రూ.20 లక్షలు అప్పు ఉందని తేల్చి, ఖాళీ పత్రాలపై బండ్రావప్పతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. కుమారుడిపై పోలీసుల దాడి, తనతో బలవంతంగా సంతకాలు, వాహనాలు తీసుకెళ్లడంతో గ్రామంలో పరువు పోయిందని భావించిన బండ్రావప్ప ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు బళ్లారిలోని విమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ఉలిక్కిపడిన పోలీసులు 
బండ్రావప్ప ఆత్మహత్యాయత్నంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తమ అదుపులో ఉన్న సిద్ధప్ప, వాహనాలను వదిలిపెట్టారు. బండ్రావప్పను ఎవరూ కలవకుండా, ఆస్పత్రిలో ఫొటోలు తీయకుండా తమకు అనుకూలమైన ఒక లెక్చరర్‌ను కాపలా ఉంచారు. ఇక వ్యవహారం రాయదుర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. దీంతో విషయం బయటకు రానీయొద్దని, సిద్ధప్పను ఒప్పించి ఆయన ఇచ్చిన రూ.10 లక్షలు తిరిగి ఇచ్చేస్తామని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
