అవినీతిని కేంద్రీకరించి.. మాపై నిందలా?
సీఎం చంద్రబాబు తీరుపై టీడీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసహనం
సాక్షి, అమరావతి: కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం బాగోలేదని.. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని సీఎం చంద్రబాబు ఆదేశించడంపై అంతర్గతంగా వారంతా రగిలిపోతున్నారు. నిజానికి కట్టుతప్పి వ్యవహరిస్తోంది టీడీపీ పెద్దలేననే విమర్శలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పాలన గాలికి వదిలేసి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారనే వాదన సొంత ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు పనితీరే అధ్వానంగా ఉందని ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. మద్యం, ఇసుక దందాను కేంద్రీకృతం చేసి అక్రమాలకు తెరతీశారని పేర్కొంటున్నారు.
కమీషన్లు తీసుకుంటూ టూరిజం హోటళ్లను ప్రైవేటుకు కట్టబెడుతున్నారని, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఉర్సా, లులు, ఇండిచిప్ లాంటి సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని ఉదహరిస్తున్నారు. ప్రాంతానికి ఒక ఐజీని పెట్టి మరీ మైనింగ్ అక్రమ సొమ్మును వసూలు చేస్తున్నారని, 108, 104 వాహనాల నిర్వహణ టెండర్లను అర్హత లేని వారికి కట్టబెట్టి అక్రమాలకు తెర తీశారని మండిపడుతున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు ఇవన్నీ చేస్తూ తమను నిందించడం ఏమిటనే చర్చ ఎమ్మెల్యేల్లో జోరుగా సాగుతోంది.
ఇన్‌చార్జి మంత్రులదే బాధ్యత..
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. 48 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయని అన్నట్లు తెలిసింది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనడంలేదన్నారు. అలాంటి వారిని పిలిచి స్వయంగా తాను మాట్లాడినా మార్పు రాలేదని చెప్పినట్లు తెలిసింది. ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేల బాధ్యతను తీసుకోవాలని, వారిని నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. ఒక్కో ఇన్‌చార్జి మంత్రికి ఐదుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని, నేతలను పరిగణనలోకి తీసుకోవడంలేదని పేర్కొన్నట్లు తెలిసింది.


