
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు
కాంట్రాక్టులు, పోస్టింగులు, సెటిల్‌మెంట్ల దందా
తమ మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు
మీ జోక్యం ఏమిటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు
విశాఖలో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఓవర్ డామినేషన్
అన్ని నియోజకవర్గాల్లోనూ పెత్తనం
గాజువాకలో వేలు పెట్టడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అసహనం
నంద్యాల ఎంపీ శబరి హడావుడికి ఎమ్మెల్యేల బ్రేకులు
తండ్రితో పెత్తనం చేయిస్తుండటంతో అధిష్టానానికి ఫిర్యాదులు
విజయవాడలో చిన్నిదే అంతా
నెల్లూరులో వేమిరెడ్డిపై ఎమ్మెల్యేల భగ్గు
ఎంపీ లావు తీరుపైనా ఆగ్రహం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో సెటిల్‌మెంట్లు, కాంట్రాక్టులు, అధికారుల పోస్టింగ్‌ల విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. వాటాలు పంచుకునే విషయంలో, డబ్బులు దండుకోవడంలోనూ సిగపట్లు పడుతున్నారు. ఈ వ్యవహారాల్లో మీ పెత్తనం ఏమిటని ఎంపీలపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. పలువురు ఎంపీలు సీఎం చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అండతో అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తుండడాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో ఎంపీల పెత్తనం ఏమిటని నిలదీస్తున్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు.
విశాఖలో లోకేశ్ తోడల్లుడు భరత్ హవా..
ముఖ్యంగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ తీరుతో ఆ జిల్లా ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. నారా లోకేశ్‌కు స్వయానా తోడల్లుడు కావడంతో భరత్ అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలోనూ భరత్ వేలుపెట్టడాన్ని పల్లా సహించలేకపోతున్నారు.
ప్రభుత్వమే తన చేతిలో ఉన్నట్లు భరత్ విశాఖ వ్యవహారాలన్నింట్లో తలదూర్చుతుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. భరత్ అన్ని నియోజకవర్గాల్లోనూ తన వర్గాన్ని తయారు చేసుకుని వారిని ప్రోత్సహిస్తూ వారికే పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గాజువాక నియోజకవర్గంలో ఒక భూమి పంచాయతీలో తలదూర్చి అక్కడికి తన అనుచరుల్ని పంపి వీరంగం సృష్టించారు.
ఈ విషయంలో బాబ్జీకి ఎంపీ భరత్ మద్దతు పలికారు. అంతేకాకుండా బాబ్జీకి అనుకూలంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పల్లా తన నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం ఏమిటని భరత్‌ను నిలదీయడంతోపాటు పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంకా పలు వ్యవహారాల్లో భరత్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉండే వారిని ప్రోత్సహిస్తుండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం ఎంపీ తీరుపై రగిలిపోతున్నారు.
రాయలసీమలో తండ్రి అండతో శబరి జోరు
నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరికి ఎమ్మెల్యేలతో ఏమాత్రం సరిపడడంలేదు. ముఖ్యంగా శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, జయసూర్యలతో అయితే ఆమెకు అసలు సరిపడడం లేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
శబరి తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ద్వారా చక్రం తిప్పుతుండటంతో ఎమ్మెల్యేలు ఆమె స్పీడుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న పరిచయాలు, పలుకుబడితో పలు నియోజకవర్గాల్లో బైరెడ్డి జోక్యం చేసుకోవడంతో కొందరు ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో తండ్రిని నిలువరించాలని, ఎక్కడా ఆయన జోక్యం ఉండకూడదని అధిష్టానం శబరికి ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం.
ఇటీవల శ్రీశైలం నియోజకవర్గంలో సుపరిపాలన కార్యక్రమంలో శబరి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వర్గీయులు ఆమె సమక్షంలోనే ఏరాసుపై దాడికి దిగారు. శబరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బుడ్డాతోనూ ఆమెకు వైరం ఏర్పడింది. ఒక్క డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి తప్ప ఎవరితోనూ ఎంపీ శబరికి సఖ్యత లేదు. దీంతో తాను ఎంపీగా ఉండి ఉపయోగం ఏమిటని ఆమె అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
బెజవాడ బెల్టులో అంతా తానైన చిన్ని..
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని).. నారా లోకేశ్ అండతో ఎన్టీఆర్ జిల్లాను తన గుప్పిటపట్టారు. దీంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా రగిలిపోతున్నారు. ఒక్క మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తప్ప ఎవరితోనూ కేశినేని చిన్నికి సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెటిల్‌మెంట్లు, కాంట్రాక్టులు, ఇసుక, మద్యం అన్నీ తనకే కావాలని తన మనుషుల్ని పంపడం, వారితోనే అన్ని పనులు చేయిస్తుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెటిల్‌మెంట్ల కోసమే ఆయన తన కార్యాలయంలో ప్రత్యేకంగా కొందరిని నియమించుకుని, వారితోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు.
సింహపురి వేమిరెడ్డి దంపతులదే దందా
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా మొత్తాన్ని దున్నేయాలనే చూస్తున్నారని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. టీడీపీ పెద్దల అండతో ఎంపీ చేస్తున్న అక్రమ క్వార్జ్ తవ్వకాలను ఎమ్మెల్యేలే వ్యతిరేకించి రచ్చ చేశారు. ఆయన క్వార్జ్ దందాపై విమర్శలు వెల్లువెత్తినా ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వేమిరెడ్డికి మద్దతుగా ఒక్క చిన్నమాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎంపీ తీరుపై రగిలిపోతున్నారు. తన నియోజకవర్గంలో ఎంపీ క్వార్జ్ దందా నడపుతుండడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డితోనూ ఎంపీ వేమిరెడ్డికి సరైన సంబంధాలు లేవని టాక్ నడుస్తోంది.
లావుపై పల్నాటి యుద్ధం
ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, అరవింద్‌బాబు వ్యతిరేక వర్గాలకు ఆయన మద్దతిస్తుండడంతో వారిద్దరూ రగిలిపోతున్నారు.
సత్తెనపల్లి, మాచర్ల, చిలకలూరిపేట ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులతోనూ ఎంపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. అన్నింట్లోనూ తనదే పైచేయిగా ఉండాలని చూస్తుండడం, అక్కడ తన వర్గం వారికే పనులు చేయాలని పట్టుబడుతుండడంతో లావు శ్రీకృష్ణదేవరాయలను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు.
ఎంపీలతో ఎమ్మెల్యేల కుస్తీలు
గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, కర్నూలు ఎంపీ నాగరాజుకు తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు. పోస్టింగులు, వాటాలు, దందాల దగ్గర ఎంపీల పెత్తనంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇక జనసేన ఎంపీలు ఉన్న కాకినాడ, మచిలీపట్నంల్లో అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు, వారికి అసలు పొసగడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తుండటంతో ఆ పంచాయతీలు తీర్చడానికి చంద్రబాబు పార్టీ కార్యాలయంలో కొందరిని ప్రత్యేకంగా నియమించారు.