విద్యుత్ పునరుద్ధరణ పనులపై విద్యాశాఖ మంత్రికి వివరణ ఇచ్చిన ఇంధనశాఖ మంత్రి
గొట్టిపాటి రవికుమార్‌కు ఫోన్‌చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్న లోకేశ్
బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న గొట్టిపాటి
అది సాధ్యంకాదని టెలీకాన్ఫరెన్స్‌లో తేల్చిచెప్పిన డిస్కంల సీఎండీలు
సాక్షి, అమరావతి: ‘సార్.. సార్.. ఆ పనిలోనే ఉన్నాం సర్.. చేసేస్తున్నాం సర్..’ ఇవి ఇంధనశాఖ మంత్రి చెప్పిన మాటలు. అలాగని సీఎంకో, పీఎంకో కాదు.. తోటి మంత్రితో అన్న మాటలు. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు విద్యాశాఖ మంత్రి లోకేశ్ బుధవారం ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.
బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ పునరుద్ధరిస్తామని మంత్రి గొట్టిపాటి ఆయనకు తెలిపారు. కొన్నిచోట్ల ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్ నిలిపివేసినట్లు చెప్పారు. విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు, సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు వివరించారు. గొట్టిపాటి చెప్పిందంతా విన్న లోకేశ్.. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే ఇప్పటికే ఇంధనశాఖ మంత్రిగా పేరుకే గొట్టిపాటి గానీ, అసలు నడిపించేదంతా లోకేశ్ అనే ప్రచారం ఉంది. ఉద్యోగుల బదిలీలు, ఉన్నతాధికారుల నియామకాల్లో లోకేశ్ చెప్పిందే జరుగుతోందని, తనమాట కనీసం చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తి మంత్రిలోను ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటికీ బలం చేకూరుస్తూ లోకేశ్ తనకు ఫోన్‌చేసి విద్యుత్‌శాఖపై ఆరాతీశారంటూ గొట్టిపాటి పత్రికా ప్రకటన విడుదల చేయడం ఆయన నిస్సహాయతకు నిదర్శనంగా భావిస్తున్నారు.
మరోవైపు లోకేశ్ ఫోన్‌చేసిన అనంతరం గొట్టిపాటి డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోల్ టు పోల్ పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేనిచోట విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నందున పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. లోకేశ్‌కు గొట్టిపాటి చెప్పినట్లు బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అసాధ్యమని తేల్చిచెప్పారు.


