కర్నూలులో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చాలా బాధాకరం
నెల రోజుల వ్యవధిలో నలుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామి రెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక కర్నూలు జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి శనివారం ఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్సేన్ అనే సచివాలయ ఉద్యోగి సర్జరీ అయింది... సెన్సస్ డ్యూటీ వల్ల తిరగలేక బాధ పడుతున్నా... మళ్లీ ఇంటింటికీ తిరిగి పని చేయలేను అని ఎంత వేడుకున్నా వినకుండా బీఎల్‌వో డ్యూటీ వేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్సుల గోలకు తోడు సర్వేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు క్షోభకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో సచివాలయ ఉద్యోగులు నలుగురు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల మరణించారు’ అని పేర్కొన్నారు.
హామీలేమయ్యాయి చంద్రబాబూ..?
‘ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను ఒకటే అడగదల్చుకున్నా. అయ్యా! ఉద్యోగులంతా ఎగబడి మీకు ఓటు వేసింది మీ చేతిలో ఇలా బలి అవడానికా? మీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడా నికా..? ఆత్మహత్యలు చేసుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. అందులో మొదటిది ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవం పెంపొందిస్తామన్నారు.
ఇదేనా ఉద్యోగులకు మీరు కల్పించే అనుకూలమైన పని వాతావరణం! ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పని వాతావరణం అంటే? ఆర్థికపరమైన హామీలు ఎలాగూ అమలు చేయలేదు. కనీసం ఇలాంటి హామీలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసే చర్యలు ఆపాలి’ అని డిమాండ్ చేశారు. ‘కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మనకు మంచి రోజులు వస్తాయి. సచివాలయ ఉద్యోగులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అని విజ్ఞప్తి చేశారు.


