అధికారుల సమన్వయ లోపంతోనే రైతుల ఆందోళన

Kakani Govardhan Reddy Said Authorities Should Understand Problems Of Farmers - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరసగా రెండో ఏడాది జలాశయాలకు పుష్కలంగా నీరు వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎంతో సంతోషంగా రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కూడా దిగుబడి సాధించారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. అధికారుల సమన్వయ లోపం వల్ల రైతులు ఆందోళనకు దిగారని తెలిపారు. (చదవండి: సీఎం జగన్‌ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని)

రైతులపై కేసులు పెట్టడం సరికాదని, వెంటనే కేసులు ఎత్తివేయాలని కోరారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న దళారులు, మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ధాన్యం రంగు మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలను అధికారులు అర్థం చేసుకుని స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గడువును పెంచే విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: శాఖ బాబుది.. సంతకం చినబాబుది)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top