వారధిలా న్యాయ విద్యార్థులు | Justice Prashant Kumar Mishra Comments About Law Students | Sakshi
Sakshi News home page

వారధిలా న్యాయ విద్యార్థులు

Nov 10 2021 4:48 AM | Updated on Nov 10 2021 4:48 AM

Justice Prashant Kumar Mishra Comments About  Law Students - Sakshi

మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా. చిత్రంలో జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, కె.జానకిరామిరెడ్డి తదితరులు

సాక్షి, అమరావతి: పేదలకు న్యాయం అందించే దిశగా ప్రారంభించిన ‘మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌’ను ఓ ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంలో న్యాయ విద్యార్థులే కీలకమని, మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌కు వారు వెన్నెముక లాంటి వారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు చేపట్టిన మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ కార్యక్రమాన్ని సీజే జస్టిస్‌ మిశ్రా మంగళవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. దత్తత గ్రామాల పర్యటనకు ఉద్దేశించిన వాహనాలను ఆయన  ప్రారంభించారు.  

దత్తత గ్రామాల్లో సేవలు... 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తుళ్లూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం న్యాయ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. వారు ప్రజలు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తారన్నారు. మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ ద్వారా గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు, రైతుల సమస్యలతో పాటు తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు కోర్‌ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటూ గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే సంబం«ధిత వ్యక్తులకు కోర్‌ కమిటీ ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందన్నారు.  

 చట్టాలున్నా... అవగాహన లేక 
పేదల హక్కుల రక్షణ విషయంలో పలు చట్టాలున్నా అవగాహన లేకపోవడం వల్ల  నిరర్థకం అవుతున్నాయని ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ సమర్థంగా అమలయ్యేలా 6 కమిటీలు ఏర్పాటు చేశామని హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి తెలిపారు. ఎనిమిది న్యాయ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement