తాడేపల్లి: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు వరుసబెట్టి కలెక్టర్‌లతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని, కాన్ఫరెన్సుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేతలు శూన్యమని విమర్శించారు.
‘‘రైతులు ధాన్యం కొనాలని మొత్తుకుంటుంటే గోనె సంచులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు. అకాల వర్షాలు పడుతుంటే కలెక్టర్లను రైతులను అండగా పంపాలి. కానీ విజయవాడ పిలిచి కాన్ఫరెన్స్ ల పేరుతో సొల్లు మాటలు చెప్తున్నారు. ఏడుసార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టి రైతులకు ఏం న్యాయం చేశారు? గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవటం లేదు.
మార్కెట్ యార్డుల్లో రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. కలెక్టర్లతో రైతుల కష్టాలు చూడామని చంద్రబాబు చెప్పాలి. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులు కష్టాలు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ లో తిరుగుతున్నారు. చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి? రైతులకు గానీ, ఇతర ఏ వర్గానికైనా మేలు చేశారా? కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలయినా తీర్చారా? సినిమా డైలాగులు చెప్పటం తప్ప చంద్రబాబు ఇంకేం చేస్తున్నారు?
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే సూపర్ సక్సెస్ అని ఎలా అంటారు? సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్. రైతులు అల్లాడి పోతుంటే కాన్ఫరెన్స్ లో సొల్లు కబుర్లు ఎందుకు? అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే కలెక్టర్లను విజయవాడ పిలిచి మీటింగులు ఎందుకు? ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీ పనిలో ఉన్నారు’’ అని ప్రశ్నించారు.


