
తూర్పు తీరంలో జెల్లీ ఫిష్‌ల కలకలం
భారీ గాలులు, ఆటుపోట్లకు ఒడ్డుకు చేరుతున్న సముద్ర జీవులు
బ్లూ బటన్, బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్‌లు సంచరిస్తున్నట్టు మత్స్యకారుల వెల్లడి
పొరపాటున.. అందంగా ఉన్నాయని తాకితే ఆరోగ్య సమస్యలు
శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు పుట్టించడం వీటి లక్షణం
సఖినేటిపల్లి: తూర్పు తీరంలో జెల్లీ షిష్‌లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో హైడ్రోజోవా తరగతికి చెందిన విష పురుగులు పెద్దఎత్తున తీరానికి చేరుకుంటున్నాయి. జెల్లీ ఫిష్‌లలో ఒక వర్గానికి చెందిన బ్లూ బటన్ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంతర్వేది బీచ్‌లో అధికంగా సంచరిస్తున్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిని ‘అగ్గిబాటా’లని పిలుస్తున్నారు.
పొరపాటు గానీ.. అందంగా ఉన్నాయని మక్కువతో వీటిని తాకితే అంతే సంగతులు. వాటిని తాకుతున్న వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో భారీ గాలులకు, సముద్రం ఆటుపోట్ల సమయాల్లో ఇవి ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి. పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని తప్పించుకునేందుకు స్వచ్ఛమైన సముద్ర తీరానికి సైతం వస్తుంటాయి. ఇవి సమూహంగా జీవిస్తూ.. నీటిపై తేలియాడుతూ సమూహంగానే ఒడ్డుకు వస్తుంటాయి.
బ్లూ డ్రాగన్ జెల్లీ విషపూరితమే
అంతర్వేది బీచ్‌లో గుర్తించిన బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ మాత్రం పూర్తిగా విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం గ్లాకస్ అట్లాంటికస్. ఇది బ్లూ బటన్ జెల్లీ ఫిష్‌లను ఆహారంగా తీసుకుంటుంది. బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్‌లో ఈకల వంటి నీలిరంగు పువ్వులను తలపించే భాగాన్ని తాకితే అంతే సంగతి. వాటిల్లో విషం ఉంటుంది. ఈ ఫిష్ వెనుక భాగంలో గాలి బుడగ మాదిరి నిర్మాణం ఉంటుంది. అందువల్ల ఇవి కూడా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటిని తాకితే వికారం, తలనొప్పి, వాంతులు, అలర్జీ వంటి సమస్యలకు లోనవుతారు.
తాకితే ఇబ్బందులే
చేపలు కాకపోయినా వీటి పేరు చివర ఫిష్ అని ఉండటం వల్ల వీటిని కూడా కొందరు జలపుష్పాలుగా భ్రమించే అవకాశం ఉంది. నిజానికి ఇవి ఒక రకమైన సముద్ర జీవులు. వీటిని ఎవరైనా తాకితే కుడతాయి. తద్వారా అలెర్జీ వచ్చి శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు పుడతాయి. అంతర్వేది తీరంలో గుర్తించిన బ్లూ బటన్ జెల్లీ ఫిష్ విషపూరితం కాదని మత్స్యకారులు చెబుతున్నారు.
బటన్ వంటి ఆకారాన్ని పోలి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. దీని శాస్త్రీయ నామం పోర్పిటా పోరి్పటా. దీని శరీర భాగంలో ఫోటో అనే గ్యాస్ నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి ఉండే స్పర్శకాల(టెంటకిల్స్)లో నెమటోసిస్ట్ అనే కణాలుంటాయి. మనుషులు లేదా ఏదైనా జీవి వీటిని తాకితే తమను తాము రక్షించుకోవడానికి ఈ జెల్లీ ఫిష్‌లు టెంటకిల్స్‌తో కుడతాయి. ఇవి కుట్టడం ప్రాణాంతకం కాదని సైన్స్
నిపుణులు అంటున్నారు.
ప్రాణాంతకం కాదు కానీ..
వీటి స్పర్శకాలలో నిమటోసిస్ట్ అనే విషపదార్థం ఉంటుంది. ఇవి వలలో పడితే బాక్స్ (పెట్టె) ఆకారంలో శరీరాన్ని పట్టుకుని తీయాలి తప్ప స్పర్శకాలను తాకకూడదు. ఇవి కుడితే ప్రాణాంతకం కాదు. కానీ.. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తుంటాయి. పొరపాటున వీటివల్ల ఏదైనా అపాయం జరిగితే ఎసిటిక్ యాసిడ్(వెనిగర్)లో గుడ్డను లేదా దూదిని ముంచి శరీరంపై పెట్టాలి. ఆ తర్వాత తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్‌సీ