జేఈఈ మెయిన్‌ మరోసారి వాయిదా 

JEE Main postponed once again - Sakshi

తొలిసెషన్‌ జూన్‌ 20 నుంచి 29 వరకు 

రెండో సెషన్‌ జూలై 21 నుంచి 30 వరకు 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కూడా వాయిదా! 

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది. ఈమేరకు బుధవారం రాత్రి పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ 2 విడతల పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్‌లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. ఇంతకు ముందు ఫస్ట్, సెకండ్‌ సెషన్లను 6 రోజుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించగా సవరించిన షెడ్యూల్‌లో పదేసి రోజులకు పెంచారు. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు పేర్కొన్న ప్రకారం రెండో విడత దరఖాస్తు ప్రక్రియ 8వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకొనే తేదీని కూడా తరువాత వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. 

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు, హయ్యర్‌ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్‌ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్‌ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్‌ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్‌ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు ప్రకటించడంతో బోర్డు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ తేదీలను మళ్లీ ఏప్రిల్‌ 21 నుంచి మే 4వరకు మార్చడంతో ఇంటర్‌ పరీక్షల తేదీలను కూడా మార్చి మే 6 నుంచి మే 24 వరకు పెట్టారు. ఇప్పుడు జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. 

అడ్వాన్స్‌డ్‌ పైనా ప్రభావం 
జేఈఈ మెయిన్‌ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్‌ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్‌డ్‌ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top