
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు.
తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ ఏ అరుణ్ మీడియాకు వెల్లడించారు.
శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.

ఏం జరిగిందంటే..
చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్‌తసన్), శివకుమార్, గోపిలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు.

చిత్రహింసలకు గురి చేసి..
బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్‌లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే..
ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్‌తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్‌లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.


చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ..