
విజయవాడ, శ్రీకాళహస్తిల్లో సినిమాహాళ్ల వద్ద వీరంగం
ఎవడ్రా ఆపేదంటూ రెచ్చిపోయిన వైనం
భయంతో పరుగులు తీసిన ప్రజలు
గాందీనగర్ (విజయవాడసెంట్రల్)/శ్రీకాళహస్తి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిల్లో బుధవారం రాత్రి హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జనసేన కార్యకర్తలు, పవన్‌కళ్యాణ్ అభిమానులు వీరంగం వేశారు. జనసేన జెండా ఊపుతూ ఎవడ్రా మమ్మల్ని ఆపేదంటూ రెచ్చిపోయారు. విజయవాడలో కారుతో స్వైరవిహారం చేయగా, శ్రీకాళహస్తిలో థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చినవారు భయంతో పరుగులు తీశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. విజయవాడ గాం«దీనగర్‌లోని శైలజ థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీ 39 ఆర్‌వీ 8252 నంబరు కారు దూసుకొచ్చింది.
ఐదుగురు యువకులు కారును ‘ఎస్’ ఆకారంలో వెనక్కు ముందుకు నడుపుతూ రెచ్చిపోయారు. ఒక బైక్‌ను ఢీకొట్టారు. అక్కడున్న పోలీసు వాహనంపైకి కారుతో దూసుకెళ్లారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ కిషోర్‌బాబు, ఎస్‌ఐ కుమార్, సిబ్బంది కారును ఆపేందుకు ప్రయతి్నంచినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులను చూసి కారులోని నలుగురు యువకులు వెళ్లిపోగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రం మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తించాడు.
ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు అతడిని డ్రైవింగ్ సీటులోంచి బయటకు లాగేశారు. అతడిని, కారుని త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని ఇబ్రహీంపట్నం ఏ కాలనీకి చెందిన వంశీగా గుర్తించినట్లు త్రీటౌన్ ట్రాఫిక్ సీఐ కిషోర్‌బాబు తెలిపారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కారు సీజ్ చేసినట్లు తెలిపారు.

శ్రీకాళహస్తిలో రౌడీయిజం
శ్రీకాళహస్తిలో జనసేన కూటమి కార్యకర్తలు ఆర్‌ఆర్ థియేటర్‌లోకి టికెట్ లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్నవారిపై రౌడీయిజం చేశారు. థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారించినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలకు దిగారు. ఇష్టారాజ్యంగా అరుస్తూ ఊగిపోయారు. వారంతా కూటమి వారే కావడంతో పోలీసులు కేవలం వీడియో తీసుకుని వెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయమై 1వ పట్టణ సీఐని అడగగా థియేటర్ అద్దాలు పగిలినట్లు యాజమాన్యం ఫిర్యాదు చేసిందని చెప్పారు. పరిశీలించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.