కొత్తగా.. కొంగొత్తగా.. వేగంగా పేదల ఇళ్ల నిర్మాణాలు 

Jagananna Colonies To Make Great Shape As Villages - Sakshi

గ్రామాలుగా మారుతున్న జగనన్న కాలనీలు

వివిధ దశల్లో 1.94 లక్షల ఇళ్లు

డిసెంబర్‌ 21న భారీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

పేదల సొంతింటి కల సాకారమవుతోంది.. పల్లెల స్వరూపం మారుతోంది.. జగనన్న కాలనీలు కొంగొత్త గ్రామాలుగా అవతరిస్తున్నాయి.. కళ్లెదుటే ఆనందాల లోగిళ్లను చూస్తూ పేదల మోము వికసిస్తోంది.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.  

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ప్రతి పేదవాడికీ సొంతింటిని అందించాలని సంకల్పించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అర్హులందరికీ స్థలాల పట్టాలు అందించి గృహనిర్మాణాలకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తోంది. ఈ క్రమంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,863 లేఅవుట్లు గ్రామాలుగా విస్తరిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణంతో కొత్త ఊరిని తలపిస్తోంది. లేఅవుట్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.  

వివిధ దశల్లో నిర్మాణాలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,863 లేవుట్లు ఉండగా.. 2,12,895 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో 17,916 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా రెండు జిల్లాల్లోనూ వివిధ దశల్లో ఉన్న గృహాలను వచ్చే డిసెంబర్‌ 21 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి రోజూ లక్ష్యాలను నిర్దేశించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.   

వందల కోట్లతో.. రెండు జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 322.48 కోట్లు వెచ్చించింది. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.600 కోట్లు అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి ఇంటికీ డీఆర్‌ డీఏ ఆధ్వర్యంలో రూ.35 వేలు అదనంగా అందిస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు కూడా అడిగిన వెంటనే ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది.  

నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి  
ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత ఎక్కువ మందికి గృహాలు అందించాలని నిర్ణయించి ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించి పనులు పూర్తి చేయిస్తున్నాం. ఇప్పటికే పెండింగ్‌ బిల్లులు చెల్లించి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ గృహనిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం.  
– వె.ప్రసన్న వెంకటేష్, కలెక్టర్, ఏలూరు

ప్రభుత్వమే అన్నీ సమకూర్చుతూ.. 
అధికారులు సిమెంట్, ఐరన్, ఇసుకను ఇంటి వద్దనే అందిస్తున్నారు. నిర్మాణ పనుల కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. నేను, నా భార్య కూలీలతో కలిసి పనిచేస్తున్నాం. మా ఇద్దరికీ ఉపాధి పథకం ద్వారా 90 రోజుల కూలీ డబ్బు లు రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. సంతోషంగా నిర్మాణం పూర్తి చేస్తాం.  
– పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం. 

పక్కాగా మౌలిక వసతులు  
ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీ భూమి మెరక చేసింది. దీంతో మాకు పునాది ఖర్చు రూ.50 వేల వరకు తగ్గింది. కాలనీలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంటు ఇచ్చారు. గ్రావెల్‌ రోడ్డు వేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారులు అన్ని పనులు దగ్గరుండీ చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.   
– బసవరాజు వెంకటేశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం  

స్థిరాస్తిని అందించిన ప్రభుత్వం   
ఇతడి పేరు కిల్లారి రాంబాబు, భీమడోలు మండలంలోని గుండుగొలను గ్రామం. వీరి కుటుంబానికి ప్రభుత్వం సెంటున్నర భూమి ఇచ్చి ఇంటిని మంజూరు చేసింది. ఐదు నెలల క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసి కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేయడంతో పాటు జగనన్న తనను రూ.5 లక్షల ఆస్తికి హక్కుదారుడిని చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ఆనందంగా నిర్మాణం 
ఈమె పేరు కానూరి పార్వతి, భీమడోలు మండలం గుండుగొలను గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో అవస్థలు పడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. సెంటున్న స్థలాన్ని ఉచితంగా అందించగా ఆనందంగా నిర్మాణ పనులు చేపట్టింది. తన దశాబ్దాల కల సాకారమైందని, జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని ఆమె అంటున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top