సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్‌'..నివేదికలో ఆసక్తికర విషయాలు..

Internet Users Spending More Time Online Shopping Than Social Media - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక వినియోగదారులు ఇంటర్నెట్‌ను వినోద మాద్యమాలను వీక్షించేందుకే ఉపయోగిస్తున్నారు. వారు వినోదమే ప్రధానం అంటున్నారు. సోషల్‌ మీడియాపట్ల వారిలో నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లుతోంది. అదే సమయంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ఇంటర్నెట్‌ వినియోగం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు.. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండటం మార్కెట్‌పై ప్రభావం చూపుతుందన్నది స్పష్టమవుతోంది. ‘ఇండియా ఇంటర్నెట్‌ రిపోర్ట్‌–2022’ నివేదిక భారతీయుల ఇంటర్నెట్‌ వినియోగ అభిరుచి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు.. 

ముందు వినోదం.. ఆ తర్వాతే సమాచారం 
దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. అత్యధికులు వినోదం కోసమే దానిని వినియోగిస్తున్నారు. మొత్తం వినియోగదారుల్లో 85 శాతం మంది వినోదం కోసమే నెట్‌ను ఉపయోగిస్తుండటం ప్రాధా­న్యత సంతరించుకుంది. టీవీ చానళ్లు, యూట్యూబ్‌ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్స్, క్రీడా కార్యక్రమాల వీక్షణం మొదలైన వాటికే ఇంటర్నెట్‌ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. అంతేకాక..  

వినోదం తరువాత రెండో స్థానంలో అత్యధికులు సమాచార సాధనంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. 77శాతం మంది వాట్సాప్, ఫోన్‌కాల్స్, వెబ్‌సైట్లు, తమ ఆఫీసు వ్యవహారాల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు.  

2022లో ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో వచి్చన గణనీయమైన మార్పు సోషల్‌ మీడియాపై ఆసక్తి సన్నగిల్లడం. 2021లో 78శాతం మంది సోషల్‌ మీడియా కోసం ఇంటర్నెట్‌ను వినియోగించేవారు. అదే 2022 నాటికి అది 70 శాతానికి పడిపోయింది. ఇప్పటికీ మొత్తం వినియోగదారుల్లో సోషల్‌ మీడియా కోసం ఇంటర్నెట్‌ను వినియోగించే వారు మూడో స్థానంలో ఉన్నారు. 

ఇక వాణిజ్య, వ్యాపార లావాదేవీల కోసం ఇంటర్నెట్‌ వినియోగించే వారు 52% మంది. 2021 కంటే వాణిజ్య అవసరాల కోసం ఇంటర్నెట్‌ వినియోగించే వారు 14% మంది పెరిగారు. వీరిలో పట్టణ, నగర ప్రాంతాలకు చెందిన వారు 65% మంది. 

ఇక దేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ పట్ల వినియోగదారుల ఆసక్తి క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 34 శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారు 2021 కంటే 2022లో 19 శాతం మంది పెరిగారు.  

ఇక ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 61% మంది పట్టణ, 31% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు.  

భారీగా పెరుగుతున్న వినియోగదారులు
ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోంది. 2022 డిసెంబర్‌ నాటికి దేశంలో 75.90 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఏదో ఒక రీతిలో దీనిని వినియోగిస్తున్నారు. 2021 కంటే 2022లో ఇంటర్నెట్‌ వినియోగదారులు 10శాతం పెరిగారు. 2025 నాటికి ఈ సంఖ్య 90 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
చదవండి: వాట్సాప్‌లో చీటింగ్‌!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top