వాట్సాప్‌లో చీటింగ్‌!

Cybercriminals are choosing new ways for Cheating - Sakshi

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త దోపిడీ పంథా

అంతర్జాతీయ నంబర్లతో వాట్సాప్‌ కాల్స్‌ 

సాధారణ స్పామ్‌ కాల్స్‌ను నిరోధించే ‘ఏఐ’ను దాటుకుని కొత్త మోసం

‘మనీ ఫర్‌ లైక్స్‌’ పేరుతో టోకరా

సాక్షి, అమరావతి: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌­లో ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెలి­కాం సంస్థలు తీసుకుంటున్న భద్రతా చర్యలకు పైఎత్తులు వేస్తున్నారు. సాధారణ స్పామ్‌ కాల్స్‌ కట్టడికి ఏఐ (ఆర్టిఫిషి­యల్‌ ఇంటెలిజెంట్‌) ఫిల్టర్ల­ను ప్రవేశపెట్టిన­ప్పటికీ అంతకు మించి దోపిడీ మార్గాల­ను అన్వేషిస్తున్నారు. అంతర్జా­తీయ నంబర్ల వాట్సాప్‌ కాల్స్‌తో నేరాలకు పాల్పడుతు­న్నారు. దేశం­లో సుమారు 480 మిలియన్ల వాట్సా­ప్‌ వినియోగదా­రు­లుం­డటం, ప్రపంచంలోనే అతిపెద్ద వాట్సాప్‌ కేంద్రం కావడంతో సైబర్‌ నేరగాళ్ల దృష్టి మనపై పడింది.

అంతర్జాతీయ నంబర్లతో..
వాట్సాప్‌ వినియోగదారులకు ఎక్కువగా ఇథియోపియా (+25), మలేషియా(+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), మాలి (+223), గినియా (+224) వియత్నాం (+84)తో పాటు మరికొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ నంబర్లతో పదేపదే వాట్సాప్‌ కాల్స్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఆగ్నేయాసియా దేశాల ఐఎస్‌డీ కోడ్‌లతోనే కాల్స్‌ వస్తున్నాయి.

కనిపెట్టడం కష్టం..
అంతర్జాతీయ నంబర్లతో వస్తున్న వాట్సాప్‌ కాల్స్‌ ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. ఒక ఐఎస్‌డీ కోడ్‌తో వచ్చే వాట్సాప్‌ కాల్‌ను మోసగాళ్లు అదే దేశం నుంచే చేస్తున్నట్లు నిర్ధారించలేం. విదేశాల్లో ఉండే వారి ద్వారా అక్కడి నంబర్‌ తీసుకుని వేరే దేశంలో ఉంటూ వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసు­కుని మోసపూరిత కాల్స్‌ చేయ­వచ్చు. బయట మార్కెట్‌లో చాలా ఏజెన్సీలు నేరగాళ్లకు అంతర్జాతీయ నంబర్లను విక్రయిస్తున్నాయి. 

‘మనీ ఫర్‌ లైక్స్‌’ స్కామ్‌
వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జాబ్‌ ఆఫర్లను పంపడం కొత్త రకం స్కామ్‌. ఇంటి నుంచి పార్ట్‌టైమ్‌ ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌ పంపుతారు. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని, టెలిగ్రామ్‌ చానెల్‌లో చేరాలని నమ్మబలుకుతారు. యూట్యూబ్‌ వీడియోల లైక్‌ బటన్‌ నొక్కడం, పోస్టులపై కామెంట్లు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ను ప్రచారం చేయడం లాంటి పనులు చేయాలని చెబుతారు. బాధితుడిని నమ్మించడానికి తొలుత చిన్న చిన్న టాస్క్‌లు అప్పగించి చెల్లింపులు జరుపుతారు.

ఆ తర్వాత నెమ్మదిగా అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ టాస్క్‌లను కేటాయిస్తారు. అయితే ఈసారి ముందస్తుగా భారీగా డిపాజిట్‌ చేయాలని కోరతారు. ఇక్కడే బాధితులు మోసపోతున్నారు. డిపాజిట్లు వసూలు చేసుకున్నాక నేరగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. ఇక్కడ ఏదో ఒక సమయంలో నగదు రిటర్న్‌లతో నకిలీ సమస్యను సృష్టిస్తారు. యూజర్లు తమ టాస్క్‌లకు వచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు కొంత మొత్తం చెల్లించాలని వసూలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే బాధితులను స్టాక్స్, క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.

బ్యాంకర్ల పేరుతో..
నేరగాళ్లు ‘ఏఐ’ చాటున స్పూఫింగ్‌ ద్వారా బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీల నుంచి మెసేజ్‌ కాల్‌ వస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు. బ్యాంకు ప్రతినిధిగా నటిస్తూ క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలు సేకరించి ఫోన్‌ మాట్లాడుతుండగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపి మోసాలకు పాల్పడుతున్నారు. అనాథలు, ప్రకృతి విపత్తుల ఫోటోలు, వీడియోలు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. భావోద్వేగాలకు గురి చేస్తూ స్వచ్ఛంద సంస్థల పేరుతో కాజేస్తున్నారు.

లైక్‌ చేస్తే అంతే..
యూట్యూబ్‌ టాస్క్‌లు, వాట్సాప్‌కు వచ్చే లింక్‌లను ఒక్కసారి లైక్‌ చేస్తే సదరు యూజర్‌ డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. ఆ మరుక్షణం నుంచి గూగుల్‌ మెయిల్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైళ్లను సులభంగా తెలుసుకోగలుతారు. ఇందులో భాగంగానే నిత్యం ఈ–మెయిళ్లకు అనేక ప్రమోషనల్‌ మెయిళ్లు, లోన్‌ వచ్చినట్టు లింక్‌లు కనిపిస్తుంటాయి.

వాటిని క్లిక్‌ చేస్తే యూజర్‌ మీడియా యాక్సెస్‌ మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఫేస్‌బుక్‌లో యూజర్‌ ప్రొఫైల్‌ను బట్టి రకరకాల మోసపూరిత ఆఫర్లతో ప్రలోభపెడతారు. ఆ లింక్‌లపై క్లిక్‌ చేసి నగదు చెల్లిస్తే వస్తువులు ఎప్పటికీ డెలివరీ కావు. కొన్ని సందర్భాల్లో అశ్లీలతను జొప్పించి ట్రాప్‌ చేయడం పరిపాటిగా మారింది.

వీడియో కాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌
మోసగాళ్లు బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు దండుకునేందుకు వాట్సాప్‌ వీడియో కాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు రకరకాల నంబర్ల నుంచి వీడియో కాల్‌ చేస్తారు. కాల్‌ లిఫ్ట్‌ చేయగానే అవతల మహిళ అశ్లీలంగా కనిపిస్తుంది. కాల్‌ డిస్‌కనెక్ట్‌ చేసేలోగా నేరగాళ్లు స్క్రీన్‌ రికార్డింగ్, స్క్రీన్‌ షాట్‌ తీస్తారు. ఆ తర్వాత బాధితుడికి పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు.

మరికొన్ని ఘటనల్లో వీడియో కాల్స్‌ వస్తున్నప్పటికీ యూజర్‌ స్క్రీన్‌పై ఎటువంటి ఆడియో లేకుండా ఖాళీ వీడియో కనిపిస్తుంది. చూస్తుండగానే కాల్‌ అకస్మాత్తుగా కట్‌ అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మార్ఫింగ్‌ చేసిన అశ్లీల వీడియోను పంపి డబ్బులు ఇవ్వకుంటే యూజర్‌ కాంటాక్ట్‌లకు పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు గుంజుతారు.  

ఆ కాల్స్‌ను బ్లాక్‌ చేయండి
సైబర్‌ మోసగాళ్లు అనేక విధాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తారు. వాట్సాప్‌లో అవాంఛిత, అంతర్జాతీయ కోడ్‌లతో ఫోన్లు వస్తే తిరస్కరించాలి. పదేపదే వస్తుంటే బ్లాక్‌ చేసి వాట్సాప్‌లోనే రిపోర్టు చేయాలి. ఎటువంటి లింక్‌లపై క్లిక్‌ చేయకూడదు. క్లిక్‌ చేస్తే యూజర్‌ డేటా మొత్తం క్షణాల్లో సైబర్‌ నేరగాళ్లకు చేరుపోతుంది. తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. డిస్కౌంట్లు, చెకింగ్‌ల పేరుతో ఎవరూ ఫోన్‌ చేసినా వివరాలు చెప్పొద్దు. సైబర్‌ మోసాలకు గురైన బాధితులు నేషనల్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112, సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలి.
– అమిత్‌ బర్దార్, ఎస్పీ, సైబర్‌ క్రైమ్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top