‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక ఏఎఫ్‌ఏఏ అవార్డు 

International respect for Sakshi Media Group movement

సాక్షి మీడియా గ్రూపు ఉద్యమానికి అంతర్జాతీయ గౌరవం 

పర్యావరణ పరిరక్షణలో తెలుగు సంకల్పానికి గుర్తింపు 

సాక్షి, హైదరాబాద్‌: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్‌ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అడ్వర్టైజింగ్‌ అసోసియేషన్‌ (ఏఎఫ్‌ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

‘కార్పొరేట్‌ సోషల్‌ క్రూసేడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’సిల్వర్‌ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్‌ఏఏ చైర్మన్‌ శ్రీనివాసన్‌ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్‌ అవినాష్‌ పాండే, ఆలివ్‌ క్రౌన్‌ చైర్మన్‌ జనక్‌ సర్థా ఈ అవార్డును అందజేశారు. 

పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. 
ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్‌ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం.

ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్‌ రూపంలో ప్రసారం చేస్తోంది.

పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/  వెబ్‌ సైట్‌లో చూడవచ్చు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top