బుడుగుల సినిమా పండుగకు రండి 

International Children Film Festival in Tenali Andhra Pradesh - Sakshi

నేటి నుంచే తెనాలిలో అంతర్జాతీయ చిల్డ్రన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ 

సిద్ధమైన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం 

తెనాలి: ఆంధ్రా ప్యారిస్‌ తెనాలిలో అంతర్జాతీయ బాలల సినిమా పండుగకు వేళయింది. చిల్డ్రన్స్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సహకారంతో ఆది, సోమవారాల్లో అంతర్జాతీయ చిల్డ్రన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. తెనాలిలోని వివేక పబ్లిక్‌ స్కూలు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిల్డ్రన్స్‌ ఫిలిం సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ రావిపాటి వీరనారాయణ, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కె.రామరాజు వివరాలను తెలియజేశారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖాలేదా నసీమ్‌ ముఖ్యఅతిథిగా, బాలల చిత్రాల దర్శకుడు నాగమురళి తెడ్ల, ప్రముఖ బాల నటుడు ఎ.భానుప్రకాష్‌ తదితరులు హాజరవుతారు.

మధ్యాహ్నం నుంచి బాలల చిత్రాల ప్రదర్శన ఉంటుంది. ఫిలిం ఫెస్టివల్‌ రెండోరోజు సోమవారం తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి బీహెచ్‌ఎస్‌ఎస్‌ ప్రకాష్‌రెడ్డి, సినిమా దర్శకుడు ఎ.సురేష్‌ పాల్గొంటారు. రెండు రోజుల్లో వివిధ దేశాలకు చెందిన మొత్తం 11 బాలల సినిమాలను ప్రదర్శిస్తారు. తెనాలిలో రెండురోజుల ప్రదర్శనలకే పరిమితం కాకుండా మరో అయిదు రోజులపాటు జిల్లాలోని వివిధ పట్టణాల్లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నామని చిల్డ్రన్స్‌ ఫిలిం సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ వీరనారాయణ చెప్పారు. సమావేశంలో కనపర్తి రత్నాకర్‌ రూపొందించిన సంస్థ లోగో, ప్రదర్శించనున్న సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు. 

ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించే బాలల సినిమాలు ఇవే.. 
ఆదివారం: ‘ది సాంగ్‌ స్పారో’ (ఇరాన్‌), చార్లీ చాప్లిన్‌ సినిమా, తెనాలి నటులు నటించిన ‘రా.. కిట్టు’ (తెలుగు), దాదా (ఉజ్బెకిస్తాన్‌), చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌ (ఇరాన్‌). 
సోమవారం: మెల్‌బోర్న్‌ (ఇరాన్‌),  మిస్టర్‌ బోన్స్‌ (సౌతాఫ్రికా), ‘దారి’ (లఘుచిత్రం), కలర్‌ ఆఫ్‌ పారడైజ్‌ (ఇరాన్‌), గుబ్బచ్చి గలు (కన్నడ), చార్లీ చాప్లీన్‌ నటించిన ‘ది ఛాంపియన్‌ అండ్‌ ఏ విమెన్‌’.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top